19, జనవరి 2010, మంగళవారం

మానవ తప్పిదాలతో మరణ శాసనాలు ...


అమ్మా, ఇక్కడంతా చీకటిగా ఉందమ్మా,
భయమేస్తోందమ్మా .
మాతృగర్భంలో చీకటి గుయ్యారంలో ఉన్నా,
ఎప్పుడూ యింత భయం వేయ లేదే అమ్మా.
అప్పుడెంత వెచ్చగా, నిబ్బరంగా ఉండేదని !
ఇప్పుడేంటమ్మా,
చీకటి భయ పెడుతోందమ్మా.
ఆకలేస్తోందే అమ్మా,
ఊపిరాడడం లేదే అమ్మా !

భయం వేస్తోందే, అమ్మా !
గుండెలు అవిసి పోతున్నాయే అమ్మా !

మానవ తప్పిదానికీ, నిర్లక్ష్యానికీ, మూర్ఖత్వానికీ, సిగ్గు లేని తనానికీ
నిదర్శనంగా
అనాచ్ఛాదిత మృత్యు గహ్వరంలో
ఒక్కడినీ పడి ఉన్నానే అమ్మా.

ఆడుకుందామని వొచ్చేను
నాకేం తెలుసు !

మీ మతి లేనితనం
నా కోసం నిలువెల్లా నోరు చేసుకుని ఉందని !
నన్ను కబళించ బోతోందని.

భయం వేస్తోందమ్మా,
దేవుడి పిలుపయిందని కాదు -
మీ తెలివి తక్కువ తనంతో
మీ పతనానికి మీరే
ఇంత కన్నా ఎంత లేసి అగాధాలు
తవ్వుకుంటారో అని .

భయం వేస్తోందే, అమ్మా !
ఊపిరాడడం లేదే అమ్మా ...అమ్మా ...అమ్ ..మా ...అమ్ ..మా ...

-- -- -- --- --- ---

బోరు బావిలో కన్ను మూసిన చిన్నారి మహేశ్ తలుచుకుని ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి