2, ఏప్రిల్ 2010, శుక్రవారం

కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే ....


చెప్పఁదగుఁగవిత రసముల్
జిప్పిల, నప్పప్ప ! భళి భళీయన. లేదా
యెప్పుడుఁజేయక యుండుటకవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే కదా. మన కవులు రస బంధురమయిన గొప్ప కవిత్వం చెప్పడంతో పాటు , కవిత్వం గురించి, కవిత్వం గొప్ప తనం గురించి కూడా మంచి కవిత్వం చెప్పారు. అలాంటి సందర్భాలను కొన్నింటిని చూదామా ?


గుడి కూలును, నుయి పూడును
వడి నీటను చెఱువు తెగును, వనమును ఖిలమౌ
చెడనిది పద్యమె సుమ్మీ
కుడి యెడమల నరసి చూడ గువ్వల చెన్నా.
సప్త సంతానాలలో ఏవీ శాశ్వతంగా నిలిచేవి కావని చెబుతూ, ఎన్నటికీ చెడనిది పద్యమే సుమా అని చెప్పడం జరిగింది.యొప్పు సుమీ, సుకవి యెంతయుచితఙ్ఞుఁడొకో
( రాజ శేఖర చరిత్ర . మాదయ గారి మల్లన.)

కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములాద్య సత్కథ
ల్వావిరి పుట్టు రత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానల దీరిన జాతి రత్నముల్
గావున నిట్టి మిశ్ర కథగా నొనరింపుము నేర్పు పెంపునన్.

( వసు చరిత్ర . రామ రాజ భూషణుడు)


తా రసపుష్ఠిమైఁ బ్రతి పదంబున జాతియు వార్తయున్ జమ
త్కారము నర్ధ గౌరవముఁగల్గ ననేక కృతుల్ ప్రసన్న గం
భీర గతిన్ రచించి మహి మించినచో నిఁక శక్తు లెవ్వ ర
య్యా ! రఘునాథ భూప రసికాగ్రణికిన్ జెవి సోకఁజెప్పఁగన్
(విజయ విలాసము . చేమ కూర వేంకట కవి.)


చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్.

( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)

కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట ! ఎంత గొప్ప కోరికో కదూ ?

కవియల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాజి గణుతింపంగాఁ
గవి నేను రామకృష్ణుఁడఁగవి యను నామంబు నీటి కాకికి లేదే ?

( తెనాలి రామలింగ కవి పేర వినిపించే చాటువు.)
కవి అంటే పెద్దన, తిక్కనాదులూ , తనూనట. మిగతా కవులు కుకవులట. కవి అనే పేరు నీటి కాకికి కూడా ఉందికదా అని వేళాకోళం చేసాడు.

గడియకు నూఱు పద్యములు గంటము లేక వచింతుఁదిట్టగాఁ
దొడగితినా పఠాలుమని తూలి పడంగుల శైలరాజముల్
విడిచి యనుగ్రహించి నిఱు పేద ధనాధిపత్యులుఁజేతు, నే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే ?

ఈ తిట్టు కవి గడియకు నూఱు పద్యాలు అవలీలగా చెప్పగలడట. తిట్టినా అంతే. కుల పర్వతాలు కదిలి పోవలసినదే. అనుగ్రహించితే కటిక పేద వాడిని సైతం ధనవంతునిగా చేయ గలడట ....

నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె మాత్మకింపయిన భోజనముయ్యెల మంచ మొప్పు త
ప్పరయు రసఙ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే ?

(అల్లసాని పెద్దన)
కవి గారికి కవితా రచన చేయడానికి ఎన్ని సదుసాయాలు కావాలో చూడండి ...
ధూర్జటి కవిత్వానికి అతులిత మాధుర్యం చేకూరడానికి కారణం తెలుసు కదా ?


స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
యతులిత మాధురీ మహిమ ! హా ! తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితాజనతా ఘనతాపహారి సం
తత మధురోధరోదిత సుధారస ధారలు గ్రోలుటం జుమీ !

కవి గారి కవితకి అంత మాధుర్యం అబ్బడానికి నిత్యం సౌకుమార్యం కల కన్నియల అధర మాధుర్యాన్ని చవి చూస్తూ ఉండడమేనట.

పలుకగ వలె నవరసములు,
కులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
నళుకక యటు గాకున్నం
బలుకక యుండుటయె మేలు బహుమానముగన్

( రఘునాథ రాయలు. రామాయణం)
చెప్తే నవరసాలూరు కవిత చెప్పాలి. లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. అదీ సంగతి. తెలిసిందా ?


రెండర్ధంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబుగా
కుండుం, దద్గతి కావ్య మెల్ల నగునే నొహో యనంజేయదే
పాండిత్యంబున? నందునుం దెనుఁగుగబ్బంబద్ధుతంబండ్రు , ద
క్షుండెవ్వాడిల రామ భారత కథల్ జోడింప భాషా కృతిన్.

(పింగళి సూరన. రాఘవ పాండవీయం ద్వ్యర్ధి కావ్యం,)

రెండర్ధాల పద్యం రాయడమే కష్టం. మొత్తం కావ్యం అంతా అలా రాయాలంటే సాధ్యమా ?
భారత రామాయణాలని ఓహో అనే లాగున ద్వ్యర్ధి కావ్యంగా రాసి చూపిస్తున్నాను. చూడండి తమాషా అని కవి ఎంత ధీమాగా చెబుతున్నాడో కదూ ?


పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా ?
అని ప్రతిన పూని మహా భాగవత రచన చేసాడు పోతన కవి.

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మా లిఖ మాలిఖ, మాలిఖ !!!

ఓ బ్రహ్మ దేవుడా, నా నుదుటి మీద ఎన్ని కష్టాలనయినా రాయి. సహిస్తాను. కానీ, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం రాయకు. ముమ్మాటికీ రాయకు.

అరసికులకు కవిత్వం వినిపించవలసి రావడం ఎంత బాధాకరమో కవి వాపోతున్నాడు. గమనించారా?

నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు రే
ఖా కమనీయ వైఖరులు గాంచి, భళి! భళీ!! యన్నవాడె, ‘ మీ
దేకుల’’ మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్.

( జాషువా కవి)

అంత వరకూ కవిత్వాన్ని అహో, ఒహో అంటూ తెగ మెచ్చుకుని , కులం పేరడిగి, తెలుసుకొని చీదరించుకునే నీచుల గురించి జాషువా కవి ఎలా వాపోయాడో ఈ పద్యంలో చూసారు కదూ?

పాతదంతా మంచిదనీ, కొత్తదతా తిరస్కరించదగినదని అనుకో రాదని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో హెచ్చరించాడు.


పురాణమిత్యేవ న సాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్యవద్యం
సంత: పరీక్ష్యాన్తరత్ భజంతే
మూఢ పర ప్రత్యయ నేయ బుద్ధి :
దీనికి వేలూరి శివరామ శాస్త్రి గారి అనువాద పద్యం కూడా చూడండి.


రమ్య మెప్పుడు గాదు పురాణమనుచు
గొనబు గల్గిన దనరాదు క్రొత్తదనుచు
పండితుండొండు దానిని భజన సేయు
మూఢుడితరుల వచించు బుద్ధి నొప్ప.

అందుకే ఆధునికులలో గురజాడ ...

పాత కొత్తల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటా వీవు, నీవిక
చెచ్చకుంటే మించి పాయెను

అని తిరస్కరిస్తూ ...

ఆకులందు అణగిమణగీ
కవిత కోకి పలుక వలెనోయ్
ఆపలుకులను విని
దేశమందభిమానములు
మొలకెత్తవలనోయ్

అని చెప్పాడు. అడుగు జాడ గురజాడది. అది భావికి బాట.


కుక్కపిల్లా, అగ్గిపుల్లా,సబ్బుబిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ
కవితా మయమేనోయ్ అన్నీ ...

అంటూ చెప్పిన శ్రీ.శ్రీ గారు కాదేదీ కవితకనర్హం అని పేర్కొన్నారు.
ప్రపంచమొక పద్మవ్యూహం అంటూ, కవిత్వమొక తీరని దాహం అని కూడా చెప్పారు.కదూ?

బాలగంగాధర తిలక్ కవిత్వం ఒక ఆల్కెమీ ... దాని రహస్యం కవికే తెలుసునని చెప్ప లేదూ?
కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అనడానికి అనంతమైన ఉదాహరణలు ఉన్నాయి.

దాదాపు ప్రాచీన, ఆధునిక కవులందరూ కవిత్వం మీద కవిత్వం చెప్పిన వారే. మచ్చునకు కొన్ని ఉదాహరణలు చూపించానంతే ...
బాలగంగాధర తిలక్ (అమృతం కురిసిన రాత్రి) నుండి ‘నా కవిత్వం ’ అనే తిలక్ కవితతో ముగిస్తాను ....

నా కవిత్వం


నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజి పువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథ: పతంగాలూ
ధర్మ వీరుల కృత రక్తనాళాలూ
త్యాగ శక్తి ప్రేమ రక్తి శాంతి సూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతా
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.