21, ఆగస్టు 2010, శనివారం

శాంతము లేక, సౌఖ్యమూ లేదూ ...


తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:

న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.

కోపం మంచి వాళ్ళకి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది.

చందనం చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా?

కోపం అగ్ని లాంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు.

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము,

తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !

అని బద్దె భూపతి చెప్ప లేదూ?

క్రోధమ తపముంజెఱచును

క్రోధమ యణిమాదులైన గుణములఁబాపున్

క్రోధమ ధర్మ క్రియలకు

బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికి జన్నే?

(నన్నయ . భారతం)

కోపం వలన తపస్సు చెడి పోతుంది. అణిమాది సిద్ధులు పనికి రాకుండా పోతాయి. కోపం ధర్మ విధులకు ఆటంకం కలిగిస్తుంది. మునులకు కోపం తగదు.

చీటికీ మాటికీ వెర్రి కోపంతో ఊగి పోతూ శాపాలిచ్చే దూర్వాస ముని తెలుసు కదా? దాని వలన అతని

తపో ఫలితమంతా హరించుకు పోయేది.

కీచకుడు ద్రౌపదిని చెరబట్టాలని తమకంతో వెంట తరిమాడు. ఆమె విరటుని కొలువు లోనికి ప్రవేశించింది. ఆమెను తరుముతూ వచ్చేడు కీచకుడు. అక్కడే ఉన్నవలలుడు అనే పేరుతో విరటుని కొలువులో వంటల వాడిగా ఉన్న భీముడికి కోపం నసాళానికెక్కింది. అమిత క్రోధా వేశంతో ఊగి పోయేడు. అక్కడ ఉన్న ఓ ఫలవృక్షాన్ని పెకిలించి, దానితో కీచకుని అంతం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.

అంత పనీ చేసే వాడే, కంకుభట్టుగా విరటుని కొలువులో ఉన్న ధర్మ రాజు గూఢ భాషణంతో వారించ బట్టి సరి పోయింది. లేక పోతే, అఙ్ఞాత వాసం భగ్నమై, కథ మళ్ళీ మొదటి కొచ్చి ఉండేది.

వలలుండెక్కడఁజూచె? నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే?

ఫలితంబై వర శాఖ లొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్

విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగాఁ

గల యీ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్ !

ఈ వంటల వాడు వలలుడు ఈ ఫలవృక్షాన్ని ఎక్కడ చూసాడయ్యా ! ఒట్టి మూర్ఖుడిలా ఉన్నాడే? చక్కగా పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి, అందరికీ నీడని ప్రసాదిస్తూ సేద దీర్చే ఈ పండ్ల చెట్టు ఇతనికి వంట కట్టెల కోసం కావలసి వచ్చిందా? వేరే చోట ఎక్కడా ఎండి పోయిన పనికి రాని చెట్లే లేనట్టు వీడి కన్ను దీని మీద పడ్డదేమయ్యా. పండ్ల చెట్టుని ఎవరయినా వంట చెఱకు కోసం తెగ నరుకుకుంటారా?

ధర్మ రాజు మాటలలోని అంతరార్ధం గ్రహింపునకు వచ్చేక భీమ సేనుడు అప్పటికి శాంతించేడు. ఆ తర్వాత వడ్డీతో సహా తన కసి తీర్చుకున్నాడనుకోండి.

కోపం వస్తే వారించడానికి అందరకీ అలాంటి అన్నగార్లు దొరకొద్దూ?

అన్నగారంటే అన్నగారా ! ధర్మ రాజు గుణ గణాలను వర్ణిస్తూ విజయ విలాసంలో చేమకూర వేంకట కవి ‘‘ కోపమొకింత లేదు, బుధ కోటికి కొంగు పసిండి, పత్యమా రూపము, తారతమ్యము లెఱుంగని స్వతంత్రుడు ... యిత్యాదిగా వర్ణించాడు.

అందు చేత కోపం తగ్గించు కోవడం మంచిది. కోపం వల్ల ఎంత వినాశం జరిగిందో చెప్పడానికి మన పురాణాలలోనూ, కావ్యాలలోనూ , ప్రబంధాలలోనూ అసంఖ్యాకమైన వృత్తాంతాలున్నాయి.

అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే చదవడానికి విసుగు వేసి మీకు కోపం రావచ్చు.

చివరగా రెండు చిన్న జోకులు:

అప్పా రావు: ఎందుకురా, అంత కోపంగా ధుమ ధుమలాడి పోతున్నావు?

పాపారావు: ఆ శాంతారావు గాడిని కోపం తగ్గించుకోరా నాయనా, అని చిలక్కి చెప్పినట్టగా ఎంత చెప్పినా వినడే ! వొళ్ళు మండి పోయిందనుకో, చెడామడా దులిపేసాను...

మరొకటి:

భర్త: మా ఆవిడకి వొళ్ళెరుగని పిచ్చి కోపమనుకో. ప్రతి దానికీ ఒకటే అరుస్తూ ..

భార్య: ఆఁ ... ప్రతి దానికీ ఊరికే అరుస్తూ ఉంటాను. గోల చేస్తాను. అదేగా మీరు చెప్నబోయేది? (అంటూ గయ్యిమంది)

2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

త్యాగరాజ కీర్తన అర్థం ఇదే కదా

కమనీయం చెప్పారు...

త్యాగరాజ కీర్తన అర్థం ఇదే కదా

కామెంట్‌ను పోస్ట్ చేయండి