25, ఆగస్టు 2010, బుధవారం

భగవంతుడు భక్త సులభుడు !!



వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా,
కుబ్జాయా: కిము నామరూపమధికం కిం వా సుధామ్నో ధనం.
వంశ: కో విధురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం,
భక్త్యా తుష్యతి కేవలం న చ గుణై: భక్తప్రియో మాధవ:

భగవంతుడు భక్త సులభుడు. భక్త జన పక్షపాతి. ఆ పరమార్ధాన్ని ఈ శ్లోకం వివరిస్తున్నది.

గుహుని నడవడి ఎలాంటిది? పడవ నడుపుకునే వాడు. ఒక నిషాద రాజు. రామ భక్తుడు. ఇతని నగరం శృంగిబేరి పురం. దండకారణ్యానికి బయలు దేరిన సీతా రామ లక్ష్మణులను గంగానదిని దాటించాడు. కేవల నిషాదుడయిన గుహుని ఎంతో ఆదరంతో రాముడు చూసి అతని జన్మ చరితార్ధం చేసాడు.

ధ్రువుని వయసనగా ఎంత? అతనికి మహోన్నత స్థానం భగవానుడు కల్పించ లేదూ?
ఇతడు సునీతి, ఉత్తానపాదుల కుమారుడు. తండ్రి అంకసీమను కూర్చుని ఉండగా సవతి తల్లి సురుచి అవమానించింది. దానితో ఇతడు తీవ్రమయిన తపస్సు చేసాడు. ఈ విష్ణు భక్తుడు ధ్రువ నక్షత్రమై నభో వీధిలో ప్రకాశిస్తూ ఉంటాడు.

ఇక, గజేంద్రుని పాండిత్యమెంత? హరి గజేంద్రుని కాపాడ లేదూ?
పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడనే ద్రవిడ ప్రభువు అగస్త్యుని శాపం వల్ల ఏనుగు జన్మ ఎత్తాడు. గజరాజయ్యాడు. దాహం తీర్చుకోడానికి కొలను నీటిని త్రాగబోయి మొసలి బారిని పడ్డాడు. వదిలించుకుందామని ఎంత పోరాటం చేసినా ఫలితం శూన్యం. అలసి పోయాడు గజరాజు. బలం సన్నగిల్లి పోయింది. ధైర్యం అడుగంటి పోయింది. ప్రాణాలు కడతేరిపోతున్నాయి. మూర్ఛ వస్తున్నది. శరీరం డస్సి పోయింది. శ్రమాధిక్యతతో మరి మకరితో పోరాడే ఓపిక లేకుండా పోతోంది. హరి తప్ప వేరే దిక్కు లేడని గ్రహించి నోరారా వేడుకుంది.
అట్టి గజరాజుని విష్ణువు కాపాడడానికి వైకుంఠ పురం నుండి హడావిడిగా బయలు దేరాడు. ఎలా వచ్చాడయ్యా, అంటే:

సిరికిం జెప్పడు, శంఖ చక్రయుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగ పతిం బన్నింపఁడా కర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణా వనోత్సాహియై

పోనీ, కుబ్జ అపురూప సౌంద్యర్యవతి కాదుకదా. మిక్కిలి అనాకారి, భక్త సులభుడు ఆమెను దయామయుడై అనునయించ లేదూ? కంసుని దాసి అయిన ఈ కుబ్జ దగ్గరకి కృష్ణుడు వచ్చి, ఆమె శరీరమును తాకడం చేతనే ఆమె కుబ్జత్వం పోయింది.

పోనీ, కుచేలుడు ఏమయినా సంపన్నుడా ఏమిటి? ఒక బీద బ్రాహ్మణుడు. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు. ఇద్దరూ సాందీపుని దగ్గర చదువుకున్నారు. బహుసంతానవంతుడు. అంతమంది పిల్లలతో సంసారాన్ని నడప లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. భార్య మాటలు కాదన లేక కృష్ణుడి దగ్గరకి బయలు దేరాడు. రిక్త హస్తాలతో వెళ్ళడం బాగుండదని కొంచెం అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. కృష్ణుడు ఆ బాల సఖుని ఎంతగానో ఆదరించి, ప్రేమగా అతడు తెచ్చిన అటుకులు ఓ గుప్పెడు తిన్నాడు. రెండో గుప్పెడు తినబోతూ ఉంటే లక్ష్మీ దేవి వారించిందిట ! ఎందుకంటే మొదటి గుప్పెడు అటుకులు స్వీకరించినందుకే అక్కడ కుబేరుని ఇంట సమస్త ఐశ్వర్యాలూ సమకూడాయి. ఆ సంగతి ఎరుగని కుచేలుడు తనకి సాయం చేయమని అడగడానికి మనసు అంగీకరించక మిత్రుని దగ్గర శలవు తీసుకుని ఇంటికి వచ్చి
చూస్తే ఇంకేముంది? ఆ దయాముని అనుగ్రహం వల్ల అతనికి అష్టైశ్వర్యాలూ సమకూడాయి.
భగవంతుడు భక్త సులభుడనడానికి ఇది తార్కాణం కాదూ?

మరి, విదురుని ఆభిజాత్యం ఎలాంటిది? సంధి పొసగదని తెలిసీ రాయబారిగా కౌరవ సభకి వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనాదులు ఇవ్వజూపిన ఆతిథ్యాన్ని సున్నితంగా కాదని, విదురుడిచ్చిన విందు స్వీకరించ లేదూ?
పోనీ, యాదవరాజు ఉగ్రసేనుడి విషయమే చూడండి.కంస వధానంతరం కృష్ణుడితనికి రాజ్యాభిషేకం చేయించాడు.

భగవానుడు భక్త సులభుడనడానికి తండ్రి పెట్టించిన దారుణమయిన హింసలనుండి ప్రహ్లాదుని కాపాడడం, శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రీతితో భుజించడం ... ఇలా ఒకటా రెండా? ఎన్ని దృష్టాంతాలనయినా పేర్కొన వచ్చును.

ఇప్పటికి స్వస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి