12, సెప్టెంబర్ 2010, ఆదివారం

హిత వచనమ్ డాట్ కామ్


సాధారణంగా ప్రసంగవశాత్తు మనం మన పెద్దల నుండి విన్న నానుడులో, సామెతలో, పద్య పాదాలో, శ్లోక చరణాలో సందర్భవశాత్తు ఉటంకిస్తూ ఉంటాం.అలా ఉటంకించే వాటిలో సద్య పాదాల, శ్లోక చరణాల చివరి పంక్తులు మాత్రమే చెబుతూ ఉంటాం. వాటి పూర్తి పాఠం మనలో కొందరకి తెలియక పోవడం కద్దు. అలాంటి వాటి పూర్తి పాఠాలను కొన్నింటిని ఇక్కడ చూదాం.

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తరుచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ శ్లోకం పూర్తి పాఠం ఇది:

అపి స్వర్ణమయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

తమ్ముడా లక్ష్మణా ! ఈ రావణ లంక మొత్తం బంగారుమయం అయితే కావచ్చును. కానీ నాకిక్కడ ఉండడం సమ్మతం కాదు. ఈ వైభోగాలేవీ నాకు రుచించడం లేదు. మన బంధుగణాన్నీ,అయోధ్యాపురినీ వెంటనే చూడాలని ఉంది. ఎందుకంటే, కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

మరొకటి:
నాస్తి జాగరతో భయం అంటూ ఉంటారు కదా, దీని పూర్తి పాఠం చూడండి:

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం

చక్కగా వ్యవసాయం చేస్తే కరువు కాటకాలంటూ ఉండవు. నిత్యం జపతపాలు చేస్తూ ఉంటే అన్ని
పాపాలూ పోతాయి. మౌనంగా ఉండడం వల్ల ఎవరితోనూ జగడం అన్నదే ఉండదు. మెలకువగా, జాగ్రత్తగా ఉంటే భయమన్నదే ఉండదు.

మరొకటి:

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే దాని పూర్తి పాఠం చూడండి:

విద్వత్త్వంచ నృపత్వంచ
నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే

పండితుడు, రాజు వీరికి పోలికే లేదు. రాజు కేవలం తన దేశంలోనే , అంటే తన రాజ్యం లోనే
గౌరవించబడతాడు. ఇక పండితుడో? లోకమంతటా గౌరవాదరాలు పొందుతాడు.

దేనికయినా మరీ ఓవరయి పోతూ ఉంటే అతి సర్వత్ర వర్జయేత్ అని హెచ్చరిస్తూ ఉంటాం,దీని పూర్తి పాఠం చూడండి:

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

కన్నూ మిన్నూ కానకుండా దానాలూ ధర్మాలూ చేసుకుంటూ పోతే నాశనమై పోతాం సుమా.అందుకు భారతం లోని కర్ణుడే తార్కాణం. ఇంద్రుడు కపటోపాయంతో కవచ కుండలాలు దానమడిగితే మరో ఆలోచన లేకుండా వాటిని దానం చేసీసేడు. అవి లేనందు వలన యుద్ధంలో మరణించాడు. అలాగే మరీ అంత దురాశా పనికి రాదు. తమదీ, పాండవులదీ కూడా రాజ్యం తనకే దక్కాలనే పేరాశతోనే కదా, దుర్యోధనుడు పేచీల మీద పేచీలు పెట్టి, కడకు భరత యుద్ధంలో దుర్మరణం పాలయ్యేడు. అలాగే మితి మీరిన కామంతో రావణుడు సీతాపహరణం చేపి రఘురాముని చేతిలో మరణించాడు. అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు
సుమా !
అందుకే చెప్పేరు, ఎప్పుడూ అతి వద్దు. మితి ముద్దు. అని.

మరొకటి చూడండి:
చెబితే వింటాడూ? వాడి కెంత తోస్తే అంత! అనుభవిస్తాడు వెధవ ! బుద్ధి: కర్మాను సారిణీ అని, మన వాళ్ళు ఊరికే అన్నారా? అనడం వింటూ ఉంటాం. దాని పూర్తి రూపం చూడండి.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.

ఇంకొకటి చూదామా?

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి పుట్టి ఉండడం ఎప్పుడూ జరిగి ఉండ లేదు. అలాంటి బంగరు లేడిని ఎన్నడూ చూడనూ లేదు. విననూ లేదు. కాని, ప్రియసతి సీత అడిగింది కదా అని,ముందు వెనుకలు ఆలోచించకుండా బంగారు లేడిని తీసుకుని రావడానికి విల్లంబలు ధరించి రాముడు పరిగెత్త లేదూ? ఆ పిదప రావణుడు సీతను అపహరించడం, రాముడు పడిన వేదన, రావణ వధ ఎన్న ఇడుముల పాలయ్యాడో కదా? చెడి పోయే కాలం వస్తే అలాంటి విపరీతమయిన బుద్ధులే పుడతాయి మరి !

చివరగా మరొకటి ...

చెప్పింది చెప్పినట్టు వెంటనే ఎప్పుడూ చేయవు కదా, ప్రతీ దానికీ ఊరకే తటపటాయిస్తావు.ఆలస్యాదమృతం విషం రా నాయనా ! అని కోప్పడుతూ ఉంటాం. దాని పూర్తి పాఠం చూడండి మరి:

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యవ్వనమ్
కాలక్షేపం న కర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని వేడి వేడిగా తినక పోతే అది జీర్ణమై చావదు. చల్లారిన భోజనం విషతుల్యం.అలాగే, యవ్వన వతులైన ముదితలు వారి యవ్వనం కోలు పోయాక అందగించరు. ప్రతీదీ తరువాత చూదాం లే అని, తాత్సారం చేయడం కూడా మంచిది కాదు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారి పోతుంది సుమా!

ఇప్పటికివి. మరి కొన్ని తదుపరి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం.

సంస్కృత శ్లోకాలే కాదు, మన కవిత్రయం వారి భారతం లోనూ. పోతన గారి భాగవతం లోనూ, రామాయణం లోనూ, ఇతర ప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలాంటివి చాలా కొటేషన్లు కనిపిస్తూ ఉంటాయి.

వీలుని బట్టి వాటిని మన హిత వచనమ్ డాట్ కామ్ లో చూదామా?

స్వస్తి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

good post

chanukya చెప్పారు...

చాలా బాగా వుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి