29, అక్టోబర్ 2010, శుక్రవారం

ఉన్నది చాలదూ ?


ఎవడు దరిద్రుడయ్యా, అంటే, ఎవడయితే ఎంతకీ సంతృప్తి చెందడో, వాడూ దరిద్రుడు.కోరికల గుర్రాలని అదుపులో ఉంచుకోక పోతే బతుకు బండి నిశ్చయంగా విషాదాల గతుకు బాటలోనే పల్టీలు కొడుతుంది. కోరికలకేం? అవి అనంతం.

ఇచ్ఛతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే
లక్షాధిసత్తధా రాజ్యం, రాజ్యస్థ: స్వర్గమీహతే

వంద కలవాడు వేయి కావాలనుకుంటాడు. వేయి కలవాడు లక్ష కావాలని ఉవ్విళ్ళూరుతాడు. లక్ష కలవాడు రాజ్యాధికారం కోసం వెంపర్లాడుతాడు. పోనీ, అది కూడా దక్కినా సంతృప్తి చెందడే !అప్పుడు స్వర్గమే తన స్వంతం కావాలని తహతహలాడిపోతాడు. ఇదీ నైజం. ఈ నైజమే అనర్ధదాయకం. సర్వ మానవ సంబంధాలనీ విఛ్ఛిన్నం చేసేది ఇదే కదా?

ఆశాపాశము దాఁగడున్నిడుపు, లేదంతంబు రాజేంద్ర ! వా
రాశి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరి గాక వైన్య గయ భూకాంతాదులన్నర్ధ కా
మాశన్ బాయఁగ నేర్చిరు ? మును నిజాశాంతంబులం జూచిరే?

(పోతన)

ఆశ అనే పాశం చాలా పొడవైనది సుమా ! దానికి కొస అంటూ లేదు.సముద్ర వేలావలయితమైన మహా సామ్రాజ్యాన్ని పొందినప్పటికీ వైన్యుడు, గయుడు మున్నగు రాజులు తృప్తి చెందారా? ఆశా మోహాన్ని విడిచి పెట్ట గలిగారా? తమ ఆశలని తుదముట్టుగా తీర్చుకో గలిగేరా? లేదే !

తనియఁబడకుండ మును గోసి కొనఁజవి
చేటె గాదు, విత్తు చేటుఁగలుగు
పక్వమైనఁగొనిన ఫలమించుఁజెడదు బీ
జంబుఁగార్య సిద్ధి చందమిట్లు

(తిక్కన)
మితి మీరిన ఆశతో, ఆబగా పండీపండని కసుగాయని కోయడం వల్ల అది చవికి చేటు. రుచికరం కాదు. అంతే కాక విత్తుకీ చేటునే కలగిస్తుంది. పండినఫలం కొంచెం కూడ చెడదు.విత్తనం కూడ చెడదు. కార్య సిద్ధి జరగాలంటే ఇదే విధంగా తగు సమయపాలన అవసరం సుమీ.

నీళ్ళ లోన మొసలి నెరమాంసమాసించి
గాల మందు చిక్కు కరణి భువిని
ఆశదగిలి నరుడు నాలాగు చెడి పోవు
విశ్వదాభిరామ వినుర వేమ

నీటిలో ఉండే చేప గాలానికి తగిలించి ఉండే ఎరకి ఆశ పడి తినబోయి, ఆ గాలానికి చిక్కి చస్తుంది. లోకాన అత్యాశకు పోయిన వాడు కూడ ఈలాగుననే నశిస్తాడు.

ఈ శ్లోకం చూడండి:

వయ మిహ పరితుష్టా వల్కలైస్త్వం దుకూలై:
సమ ఇహ పరితోషో నిర్విశేషో విశేష:
స తు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసి చ పరితుష్టే కో2ర్ధవాన్ కో దరిద్ర:.

మాకు నార చీరలతోనే సంతృప్తి కలుగుతోంది. నీకు పట్టుపీతాంబరాలు ఉంటే కాని తృప్తి కలగడం లేదు. సంతృప్తిని పొందడం అనేది ఇద్దరకీ సమానంగానే జరుగుతోంది. నేను నార బట్టలతోనూ, నువ్వు పట్టు బట్టలతోనూ ఒకే లాగున సంతృప్తిని చెందడం లేదూ?ఐతే, ఇక్కడ చెప్పుకో వలసినది ఏమిటంటే, తృప్తి ఎవడికి లేదో, ఎవని ఆశకి అంతూ పొంతూ లేదో వాడు దరిద్రుడు !

లక్షాధికారైన లవణమన్నమె కాని మెఱుగు బంగారంబు మ్రింగ బోడు. ఆపాటి దానికి ఎందుకయ్యా మితిమీరిన తాపత్రయాలు?

మనస్సు సంతృప్తి చెందినప్పుడు ఇక ధనికుడెవరు? దరిద్రుడెవరు? అంతా సమానమే.

ఇలా ఉన్నది చాలదూ? అనుకోవడం విత్తం విషయంలోనే కానీ, విద్వత్తు విషయంలో కాదు సుమండీ.

స్వస్తి.







1 కామెంట్‌:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా!
ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా ఎంతటి పరిపూర్ణమైన సాహితీ సేవ చేసావో; విధ్యుక్త ధర్మ బద్ధంగా ప్రవర్తించావో ఇప్పుడు కూడా అంతటి బాధ్యతా యుతంగా నీవు చదువుకొనినది సార్థకమ్ అయేలాగా చక్కని శ్లోకాదులను నిత్యం నీ బ్లాగు ద్వారా పాఠకుల కందిస్తూ ఆ శారదాంబ కృపాపాత్రుడవౌతున్నందుకు సహృదయ లోకం చాలా ఆనంద పారవశ్యమ్ పొందుతూ నిన్ను స్ఫూర్తిగా స్వీకరిస్తూ అభ్యుదయ పథంలో పయనిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ని యీ సేవా మార్గం సజ్జనసమ్మోహనం. అభినందనలు.నిరంతరం ఇలాగే ని సాహితీ సేవ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి