25, నవంబర్ 2011, శుక్రవారం

ఈ ఫొటోలో వ్యక్తి ఎవరని అడగను. నేనే పరిచయం చేస్తాను ...


గత మే నెలలో కామమ్మ కథ అనే ఒక టపా ఉంచాను. ఆ కథలో నేను ప్రస్తావించిన నా మిత్రుని ఫొటో అప్పట్లో లభించ లేదు.

కానీ, ఇటీవల మరో మిత్రుని షష్టి పూర్తి కార్యక్రమం కోసం మా స్వగ్రామం పార్వతీపురం వెళ్ళడం జరిగింది.
అప్పుడు నా పుస్తకాల మిత్రునికి నేను తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో అక్కడే, ఆ టపా లోనే, ఉంచ వచ్చును. కానీ మరో సారి కామమ్మ కథ పుస్తకం నా పుస్తకాల గూటి లోకి గువ్వలా వచ్చి ఎలా చేరిందో, ఆ ముచ్చట పూర్తిగా బ్లాగు మిత్రులతో పంచు కోవాలని దీనిని పెడుతున్నాను. అదీ కాక, అలా చేస్తే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అయి పోతుందనిపించింది కూడా. అది కూడా ఒక కారణం. అందుకే ఆ టపా మరొక్క తూరి ...



చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు.శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...



3 కామెంట్‌లు:

పంతుల సీతాపతి రావు చెప్పారు...

మిత్రులు రాదా గోవింద పాడి గూర్చి,పుస్తకాల కధ, చాలా బాగా రాసావ్.
ఆయనికి తెలుగు వ్రాయడం మాటలాడం బాగా వచ్చు
పాపం ఆ పుస్తకాల వ్యాపారంలో చాలా నష్ట పోయేరు.
పట్టు విడవని విక్ర మార్కుడిలా రావలసిన డబ్బులు కోసం
కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు రావలసిన డబ్బులుకన్నా
ప్లీడర్లకి ఇచ్చిన డబ్బులే ఎక్కువ అనిపిస్తూంది.
పిల్లలు అందరూ బాగు పడ్డారు.ఓ మంచి అబిమనిని జ్ఞాపకం
తెచ్చినందుకు సంతోషం

కథా మంజరి చెప్పారు...

అల్లూరి వర్మ అన్నారు...
జోగారావుగారూ,

నమస్కారం! అంతర్జాలంలో దేనికోసమో వెదుకుతూ ఉంటే, కాకతాళీయంగా మీ బ్లాగు చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఒక్క టపా మాత్రమే చదివాను. పాఢిగారితో మీ అనుబంధాన్ని చదవరులకోసం చాలా చక్కగా వ్రాశారు. ఆయన మీకోసం ఉంచిన పుస్తకాల మూట గురించి చదువుతున్నప్పుడు నా కళ్ళే చెమ్మగిల్లాయి. ఇక మీ అనుభూతి ఎలా ఉండి ఉంటుందో ఊహించగలను. ఆయన ఎవరో తెలియకపోయినా, ఆయన ఆరోగ్యం బాగుపడాలి అని, మళ్ళీ లేచి మామూలు మనిషిలా సంపూర్ణ ఆరోగ్యంతో తిరగాలి అని కోరుకుంటున్నాను.

భవదీయుడు,
వర్మ

1 జూన్ 2011 7:46 ఉ

www.apuroopam.blogspot.com చెప్పారు...

ఊళ్లన్నీ తిరిగి వచ్చి ఇప్పుడే ఈ పోస్టు చూసేను.ఓ పాతికేళ్లక్రితం పాఢీగారిని తెలియని సాహితీ పరులెవ్వరూ పార్వతీ పురంలో ఉండి ఉండరు. నాలుగేళ్లయిందనుకుంటాను వారింట్లో వారిని కలుసు కుని మాట్లాడి.మన కుటుంబానికీ ఆయనకీ ఉన్నఅనుబంధం మరువలేము. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలనివ్వాలని కోరుకుంటున్నాను.చిన్న నాటి మిత్రుని ఫోటో చూపించినందుకు కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి