3, జనవరి 2012, మంగళవారం

వన్స్ మోర్ !! మా రాముడు వలస బుగత గారూ !



ఉద్యోగ విజయాలు నాటక ప్రదర్శన ముగిసింది. కొంత మంది ప్రేక్షకులు శ్రీకృష్ణ పాత్రధారిని చూడాలని ఉవ్వళ్ళూరారు.గ్రీన్ రూమ్ లోకి వచ్చేరు. అక్కడ మేకప్ తీసేసి, తన సహజమైన వస్త్రధారణలో - అంటే, చిన్న చిలక్కట్టు, భుజం మీద చిన్న తుండు గుడ్డ, నల్లని శరీరంతో బల్ల మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ నాటకాల గురించీ, మహాభారత భాగవత, రామాయణాల గురించీ, వివిధ పురాణాల గురించీ అనర్గళంగా మాట్లాడుతున్నారు వారు. ఆయనే శ్రీకృష్ణ వేషధారి పీసపాటి నరసింహ మూర్తి గారు అంటే ఎవరూ ఒక పట్టాన నమ్మ లేక పోయేరు. ఆయన నాటకం ముగిసిన తరువాత దాదాపు ప్రతీ ఊళ్ళోనూ జరిగే తంతే యిది !

వారి స్వగ్రామం రాముడు వలస . ఆ ఊరికి నేను చాలాసార్లు వెళ్ళడం జరిగింది. మా పార్వతీపురానికి దగ్గరే వారి ఊరు. విజయ నగరం సంస్కృత కళాశాలలో నాతో పాటు చదువుకున్న మంగిపూడి వేంకట రమణ మూర్తి ( ప్రముఖ హరి కథకులు) గారి తండ్రి గారూ, పీసపాటి వారూ దగ్గరి బంధువులు. అంచేత, నేను రాముడు వలస వెళ్ళి నప్పుడల్లా వారు నన్ను మా రమణ మూర్తితో పాటు ఎంతో ఆదరంగా పలకరించే వారు. సంస్కృత కళాశాల విద్యార్థులం అనే అపేక్ష వల్ల కూడానేమో ! ఎప్పుడు రాముడు వలస వెళ్ళినా, నాయనా ! అని ఆదరంగా పిలిచే వారు . ‘‘ ఎప్పుడు వచ్చితీవు ? ...’’ అంటూ రాగయుక్తంగా పలకరించే వారు. వారితో సహపంక్తి భోజనం చేసే అదృష్టం నాకు చాలా సార్లు కలిగింది. వారి భోజన కార్యక్రమం దైవ పూజ చేస్తున్నంత నిష్ఠగా సాగేది. చిన్న కావి రంగు ముతక గావంచా కట్టకొని, పై మీద నాగుల తువ్వాలుతో వారి రూపం చూస్తే - రంగ స్థలం మీద అపూర్వ తేజస్సుతో వెలిగి పోతూ, కమ్మగా పద్యాలు చదివే మహా నటుడు వారే నంటే ఎవరికీ నమ్మ బుద్ధి కాదు.

రాగాన్ని అర్ధ రహితంగా సాగదీసి, పద్యం పాడడమే నటన అని అటు నటులలోనూ, ఇటు ప్రేక్షకుల లోనూ ఉండే భావనకి అడ్డ కట్ట వేసిన ఘనత వారిదే. కాంట్రాక్టు నాటకాలు కాంబినేషన్ పద్ధతికి అలవాటు పడడంతో ఒకే నాటకంలో ముగ్గురు నలుగురు శ్రీకృష్ణులు వగైరా పాత్రధారులు కనిపించే వారు. అంతమంది కృష్ణులలో పీసపాటి వారే అపురూపంగా మెరిసి పోయే వారు. ఆయనకు పద్యమే గద్యం. గద్యమే పద్యం. ఆయన పాండితీ వైభవం అబ్బుర పరుస్తుంది. ఇంతటి ప్రఙ్ఞావంతుడి ఎడ్యు కేషనల్ క్వాలిఫి కేషన్ అయిదో తరగతి ఫెయిల్ కావడం !

1920 జులై 10 వ తేదీన బొబ్బిలి తాలూకా, జలిజి పేట మండలం వంతరాం అనే గ్రామంలో పీసపాటి వారి జననం. చిన్న తనంల లోనే తల్లి దండ్రుల వియోగంతో కాకినాడలో వారి పిన తండ్రి గారింట పెరిగారు. కొంత కాలం పౌరోహిత్యం చేసారు. 1939 లో సామర్ల కోటకు చెందిన వాణీ నాట్య మండలి లో చేరి వశాంబి కృష్ణ మూర్తి గారి వద్ద నటనను అభ్యసించారు. ఆ సంవత్సరమే పాపమ్మ గారితో వారి వివాహం జరిగింది. 1945 లో శ్రీకాకుళం జిల్లా పొందూరు కి నివాసం మార్చారు. అక్కడ శ్రీరామ నాట్య మండలిని స్థాపించారు. 1949 లో గుంటూరులో తిరుపతి కవులలో ఒకరైన చెళ్ళపిల్ల వేంకట శాస్త్రి గారి ఆస్థాన కవి పట్ట ప్రదానోత్సవంలో జరిగిన పాండవోద్యోగ విజయాలు నాటక ప్రదర్శనలో శ్రీకృష్ణ పాత్రను అద్వితీయంగా ప్రదర్శించి కవిగారి చేతుల మీదుగా బంగారు కిరీటిన్ని బహుమతిగా అందు కున్నారు.

వారికి జరిగిన సన్మానాలకు, వారు పొందిన బిరుదులకు లెక్క లేదు.

1993 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్, తెలుగు విశ్వ విద్యాలయం వారి విశిష్ఠ పురస్కారం, రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి సత్కారం, 1949 లో టంగుటూరి ప్రకాశంపంతులు గారి చేతుల మీదుగా సువర్ణ నటరాజ విగ్రహం స్వీకరణ. నరసరావు పేటలో సువర్ణ ఘంటా కంకణం, 1950 లో విజయ నగరంలో బంగారు కిరీటం, సుదర్శన చక్రం , 1958 లో గుంటూరులో సుదర్శన చక్రం, సాలూరులో బంగారు సింహతలాటాలు. 1958 లో తెనాలిలో సువర్ణ పుష్పాభిఫేకం. స్థానం వారి చేతుల మీదుగా గండ పెండేరం బహూకరణ, 1972లో బాపట్లలో గజారోహణ, నటశేఖర బిరుదు ప్రదానం 1975 లో విశాఖ పట్నంలో తెన్నేటి విశ్వ నాథం గారి చేతుల మీదుగా గండపెండేరం, నటసమ్రాట్ బిరుదు ప్రదానం, 1976 లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాట్య కళా అకాడమీ వారి నుండి నాటక కళా ప్రపూర్ణ బిరుదు స్వీకరణ, .... ఇలా లెక్కకు మించిన బిరుదులు. సత్కారాలు వారిని వరించాయి.

198లో రంగూన్ రౌడీ అనే సాంఘిక నాటకంలో కృష్ణ మూర్తి పాత్ర పోషణతో వీరి రంగస్థల విజయ విహారం మొదలయింది.
ఎన్నో నాటక సంస్థలతో మమేకమై నాటక కళా పురోభి వృద్ధికి వీరు చేసిన సేవ అసామాన్యమైనది.

1979 లో విశాఖ పట్నంలో అక్టోబరు 12, 13, 14 తేదీలలో సాంబ మూర్తి కళామందిరంలో వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జన సంద్రం ఉప్పొంగి పోయింది !

పద్య భావం పూర్తిగా అవగతం కానప్పుడు మాత్రమే నటుడు రాగాన్ని పట్టుకొని వేళ్ళాడతాడు ! అని కుండ బద్దలు కొట్టి నట్టుగా చెప్పిన పీసపాటి వారిని శ్రీ కృష్ణ పాత్రలో రంగస్థలం మీద చూడ లేక పోయిన వారిదే దురదృష్టమంతానూ !

ప్రేక్షక జన సందోహం నుండి నిరంతర ఘోషగా వెల్లువెత్తే ‘‘ వన్స్ మోర్ !’’ లతో నాటకంలోని కథ కించిత్తు కూడా ముందుకుజరగేది కాదనేది వీరి మీద వీరిని , వీరి పద్య పఠనాన్ని అమితంగా అభిమానించే వారు ముద్దుగా చేసే ఫిర్యాదు.

2007 సెస్టెంబరు 28 న ఈ మహా నటుడు శివైక్యం చెందారు. ఆంధ్ర నాటక రంగం ఆనాడు శోక సముద్రమే అయి రోదించింది. ఆంధ్ర జ్యోతి దిన పత్రిక సంపాదకీయమే ప్రచురించింది.

వన్స్ మోర్ ! పీసపాటి వారూ, మళ్ళీ మా కోసం పుట్టరూ ? ‘‘ నాయనా !’’ అని నన్ను ఆదరంగా పిలవరూ ?
‘‘ ఎప్పుడు వచ్చితీవు ’’ అంటూ చిలిపితనంతో, ముద్దుగా రాగయుక్తంగా పలకరించరూ ?

ముఖాన రంగేసుకొని పద్యాలు వినిపించరూ ? మీరు సరేనంటే వన్స్ మోర్ !! లు పలకడానికి వేలాది గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి .

రంగ స్థల పద్య పఠనానికి రంగూ , రుచీ, వాసనా అద్దిన మీరు మళ్ళీ రావొచ్చు కదా ?

పోనీ,‘‘ మా బుగతేడీ ? ’’ అని బిత్తర పోయి అడిగే మీ రాముడు వలస రైతువారీ జనం కోసమయినా
రాకూడదూ ?


2 కామెంట్‌లు:

vedula.murty@gmail.com చెప్పారు...

chala baagaa raasaaru jogarao garu

www.apuroopam.blogspot.com చెప్పారు...

చాలా చక్కగా పరిచయం చేసారు.పీసపాటి అద్భుతమైన నటుడు.నేను ఒకసారి మా ఆఫీసు- ఏజీ ఆఫీసు -రంగస్థలం మీద శ్రీ కృష్ణ పాత్ర ధరించిన పీసపాటి వారు విశ్వరూప ప్రదర్శనం చేయడం చూసేను.అద్భుతమనిపించింది.నాటకం మొదలు కాకముందే గ్రీన్ రూమ్ లో మేకప్ వేసుకుని చుట్టకాల్చుకుంటున్న పీసపాటినీ చూసేను. నాటకం జరుగు తున్నప్పుడు ప్రేక్షకుల్లో దివాకర్ల వేంకటావధాని గారి వంటి మహామహులు ఉన్నారు.జెండాపై కపిరాజు పద్యం చదివాక అందరూ వన్సమోర్ అని కేక లేస్తే-చిన్న ఇంట్రొడక్షన్- బావా నీవు యుద్ధానికి ఉరకలేస్తున్నావు గాని నీ సభాసదులందరూ మరొక్కమారు నీకు చెప్పి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయమంటున్నారు కనుక మళ్ళా చెప్తున్నానంటూ ఆ ఒక్క పద్యం మాత్రం మళ్లా చదివారు పీసపాటి.అదీ వారి ప్రజ్ఞ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి