29, మే 2015, శుక్రవారం

తెలుగు సాంఘిక నాటక రంగచరిత్రను మహోజ్జ్వలమైన మలుపు త్రిప్ప బోయి చతికిల పడ్డ వొకానొక నాటకం విశేషాలు ( లేక ) జోరా మేషారి నటనా ప్రతిభ !

నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...

విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.

సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.

ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !

ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.

మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.

‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.

నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.

ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.

‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.

‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.

‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.

అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.

‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.

‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.

‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.

అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.

1. చిత్తం

2. చిత్తం బాబయ్యా

3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి

4. చిత్తం ... చిత్తం

5. చిత్తం ..అలా అనకండయ్యా ...

6. చిత్తం .. దండాలయ్యా.

సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.

మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.

‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.

నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.

నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే

‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.

నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.

ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.

ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !

‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను  ‘‘ అలా అనకండయ్యా ...’’ అనే డైలాగు చెప్పడానికి బదులు ... మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!

దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...

మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.

వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.

ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.





స్వస్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి