27, జూన్ 2015, శనివారం

కథా మంజరి బ్లాగయినా మూసెయ్యాలి ! పేరయినా మార్చాలి !



బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి  ప్రావీణ్యం  అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.

‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,

‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’

‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.

చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.

గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,

సరే , ప్రస్తుతానికి వద్దాం. ..

‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.

‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.

‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’

‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.

‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.

‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.

నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.

‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘

‘‘ మార్చడం ఎందుకూ ? ’’

‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.

‘‘ ... .. ...’

‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’

‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’

‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’

ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.

Katha manjari

‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.

ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.

‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు

కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.

‘‘ ఖ్ఖదా  లంఝలి ’’ ... అని తయారయింది.

‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’

‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...

అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా  పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా లంఝలి ’’ వెలిగి పోతుందీ ...’’

నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...

‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.

లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.

అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా  వెర్రి బాగుల శ్రీమతి

వాడు చెప్పిన తొక్కలోని న్యూమరాలజీ ప్రకారం నా కథా మంజరి బ్లాగు పేరు మారిస్తే వెలిగి పోవడం మాట ఎలా ఉన్నా, నన్ను అంతా తన్నడానానికి రావడం మట్టుకు ఖాయం . అంచేత బ్లాగుని మూసెయ్యడమే మేలు !


( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి