తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మార్చి 2016, శుక్రవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ..Day 02

మా  8 రోజుల  తమిళ నాడు యాత్రా విశేషాలు  2/8  Day 2.(28-2-2016)

తమిళ నాడు టూరిజమ్ వారి బస్సు లో  మా తమిళ నాడు 8 రోజుల యాత్రలో ఇది రెండో రోజు.
ఈ రోజు కొంత విశేష మేమిటంటే, ఈ రోజు మేము వొక దర్గానీ, వొక చర్చినీ, హిందూ
 దేవాలయాన్నీ కూడా చూడడం జరిగింది. మా బస్ లో అన్య మతస్తు లెవరూ లేరు. అందరమూ హిందువులమే.
 కానీ  అందరూ దర్గానీ. చర్చినీ కూడా చాలా ఆసక్తి కరంగా చూడడమే కాక, తోచిన దక్షిణలు
సమర్పించుకుని ప్రార్ధనలు కూడా చేసారు. ముఖ్యంగా వేలంగిణి చర్చి నిర్వహణని అంతా మెచ్చు కున్నారు.
సరే, రెండో రోజు ఉదయమే6.30 ని.కు బస్ బయుదేరింది. 9 గంటలకు దారిలో మా ఖర్చుతో బ్రేక్ ఫాస్టు
తీసుకుని ముందుగా తిరుకడయూర్ అనే చోట వొక పెద్ద శివాలయం దర్శించు కున్నాం. నిజానికి ఈ
 ఆలయ దర్శనం మా టూర్ పేకేజీలో లేక పోయినా, గైడ్ ఈ ఆలయానికి తీసుకు వెళ్ళాడు. ఇదొక పెద్ద
శివాలయం. బాగా రద్దీగా  ఉంది. ఇంత పెద్ద శివాలయాన్ని ఉదయాన్నే చూపించి నందుకు అందరం గైడ్ కి
 ధన్యవాదాలు చెప్పాం. ఆ ఆలయ విశిష్ఠత ఏమిటంటే, ఇక్కడ 60 ఏళ్ళు నిండిన వారు షష్ఠి పూర్తి జరుపు
 కుంటారు ! మేం వెళ్ళిన నాడు దాదాపు పది, పదిహేను  జంటల వరకూ  కుటుంబాలతో వచ్చిఅక్కడ
షష్ఠి పూర్తి జరుపు కోవడం చూసాం. అది చూస్తూ ఉంటే ముచ్చట వేసింది. ఈ శివ కోవెల చూసేక, నాగ
పట్నం బయలుదేరాం.
దీనినే నాగూర్ అని కూడా అంటారు. ఈనాగపట్నం ప్రాంతం అంతా 2004 మహా ఉప్పెనకు గురై
పూర్తిగా ధ్వంస మయినదే. తర్వాత చక్కగా పునర్మించ బడింది. ఆ పెను ఉప్పెనలో దాదాపు
20 వేల మందికి పైగా జల సమాధి అయ్యారని అంచనా. వారి స్మృత్యర్థం నాగ పట్నం సమీపాన నిర్మించిన
స్మారక స్తూపాన్ని మా గైడ్ బస్ నుండి చూపిచేడు. బస్ వో ప్రక్కగా ఆపించి బస్ దిగి ఫొటోలు తీసు
 కున్నాము.
గంటన్నర ప్రయాణంతో నాగూర్ చేరు కున్నాం. ఇక్కడ వొక ప్రాచీన మయిన దర్గా చూసేము.
ఈ ప్రాంతంలో కావేరీ నది దక్షిణ వాహినిగా ప్రవహించి, దూరాన సముద్రంలో కలుస్తుంది.
దర్గాలో లోపలి భాగంలో కూడా చాలా రకాల షాపులు ఉన్నాయి. మత పరమయిన వస్తువులూ
పూజా సామగ్రి విక్రయించడం కనిపించింది. పిల్లల ఆట వస్తువులూ అవీ సరేసరి.
దర్గా చూసేక బయలు దేరి వేలంకిని చర్చికి వెళ్ళాం. దీనినే వేలంగిణి అని కూడా వ్యవహరిస్తారు.
చాలా ప్రసిద్ధ మయిన రోమన్ కేథలిక్ చర్చి యిది. చాలా పెద్ద చర్చి. వేలంగిణీ మాత
ఆరోగ్య ప్రదాత అని విశ్వాసంతో తల్లిని   వేలాదిమంది  భక్తులు నిత్యం కొలుస్తూ ఉంటారు. 2004లో
సునామీ వచ్చి నప్పుడు వందలాది మందికి ఆ చర్చి ఆశ్రయం కలిగించిందిట.ఆ ప్రాంత మంతాపూర్తిగా
జలమయ మయినా,చర్చిలో ఒక్క చుక్క నీరు కూడా చేర లేదని చెబుతారు. కొందరు భక్తులు మన పొర్లు
 దండాల లాగా మోకాళ్ళ మీద నడుచు కుంటూ మాత దర్శనం చేసు కోవడం కనిపించింది.
చర్చి పరి శుభ్రంగానే కాక, ఎక్కడా వ్యాపార వాసనలు లేవు. మనసారా వేలంగిణీ మాతను అందరం
 దర్శించుకుని  బస్ ఎక్కాము. ఇక మా యాత్రలో ఆ రోజుకి చివర దర్శనీయ స్థలం తంజావూరు.
తంజావూరు అక్కడకి 95 కి,మీ, దూరంలో ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకి చేరాం.ttdc  వారి హొటల్ కి
 చేరుకుని గదులలో ప్రవేశించాము. ఉదయం బ్రేక్ ఫాస్టు మా ఖర్చే కనుక ఆ రోజు లంచ్,
డిన్నరూ కూడా టూరిజమ్ వారిదే నని గైడ్ చెప్పాడు. అంతే కాదు, మరు నాడు ఉదయం టిఫిన్లు కూడా
 అక్కడేనుట.  లంచ్ తీసుకుని, వేగిరం తయారయితే 3 గంటలకి తంజావూరులో చూడ తగిన ప్రదేశాలకి వెళ్ళి
 వద్దామని గైడ్ చెప్పాడు.
ఇక్కడ  టూరిజమ్ వారి  హొటల్    గురించి చెప్పాలి. నిజానికి వొక రాజ ప్రాసాదాన్ని హొటల్ గా
 మార్చడంతో చూడడానికి చాలా రిచ్ గా ఉంది. రాచ మహలు అందాలతో ఆ వసతి అందరినీ ఆకట్టుకుంది.
అక్కడ ఆతిథ్యం కూడా రాచ మర్యాదలనే తలపించేలా ఉంది.
గబగబా తయారై పోయి అందరం లంచ్ తీసుకుని 3 గంటల కల్లా బస్ క్కాము.
ఇక్కడ తంజావూరు గురించి కొంత చెప్పుకుందాం. 16వ శతాబ్దికి చెందిన నాయక రాజులు దీనిని రాజధాని
గా చేసుకుని పాలించారు. నాయక రాజులలో  అచ్యుత నాయకుడు, రఘునాథ నాయకుడు, అతని
తనయుడు విజయరాఘవ నాయకుడు చాలా ప్రసిద్ధులు. వీరు గొప్ప కళా పోషకులు. ఆ రాజులు కవులు
 కూడా కావడంతో అనేక గ్రంథాలు రాసేరు. రఘునాథ నాయకుడు కర్ణాటక సంగీతంలో గొప్ప ప్రతిభ కలవాడు.
అనేక రాగాలను తాళాలనుస్వయంగా కల్పన చేసాడు  రఘునాథనాయకుని రామాయణం, చాలా
 విశిష్ఠ మయినది. విజయ రాఘవుని రఘునాథాభ్యుదయం యక్షగానం కూడ చాలా ప్రసిద్ధ మయినది.
యక్షగాన ప్రక్రియను ఈ రాజులు  ఎంతగానో ప్రోత్సహించేరు. వాటి ప్రదర్శన కోసం ఎన్నో విశాల మయిన
వేదికలను నిర్మించారు కూడా.
చెప్పగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, విరి పొట్లము
విప్పిన గతి కుంకుమ పైపై
కప్పిన క్రియ ఘుమ్మనన్ కవిత్వము సభలన్
అనివారి నికష! ప్రతి పద్యం చమత్కారాలతో కమ్మనయిన మూడాశ్వాసాల ప్రబంధం రచించిన
 విజయ విలాస కర్త చేమ కూర వేంకట కవి , రామ భద్రాంబ మొదలయిన కవులూ,కవయిత్రులూ వీరి
 ఆస్థానంలోని వారే.

ప్రసంగవశాత్తు ఇక్కడ తంజావూరు ప్రభువుల దాన వైభవానికి చెందిన వొక కథ కూడా చెప్పు కోవాలి.
ఈ కథలో నిజం ఎంతో కానీ, తంజావూరు బద్ధకస్తుల కథగా యిది చాలా ప్రసిద్ధ మయినది.
నాయక రాజులు తమ పాలనలో వొక పెద్ద అన్నదాన సత్రం నిర్మించి పూటకి 60 వేల మంది ఉచితంగా
ముప్పూటలా భోజనాలు చేసే వీలు కల్పించారుట. ఇంత పెద్ద అన్న దాన సత్రం మరెక్కడా ఉండదు.
అన్నదాన కార్యక్రమం ముగిసేక, సత్రం అధికారులు గంట మ్రోగిస్తే దానిని విని కానీ రాజులు భోజనాలకి
కూర్చునే వారు కారుట. ఇలా ఉండగా రాను రాను తంజావూరులో ఈ అన్నదానం వల్ల సోమరుల సంఖ్య
 తామర  తంపరగా పెరిగిపోయింది. అందరి లోకీ గొప్ప సోమరి పోతు ఎవరూ అని రాజులు తెలుసుకో గోరేరుట.
వో రోజు రాత్రి సత్రానికి నిప్పు పెట్టారు. అంతా పొలోమని బయటకి పరిగెత్తారు. ముగ్గురు మాత్రం పడుకునే
 ఉన్నారు. వారిలో వొకడు కాసేపటికి విధి లేక లేచి వెళ్ళి పోయేడు. రెండవ వాడు తాము పడుకున్న
 చోటుకి  అగ్ని కీలలు వచ్చే వరకూ పడుకుని ఇక లాభం లేదనుకుని  లేచి వెళ్ళి పోయాడుట. మూడవ
వాడు మాత్రం తాను పడుకున్న చోట పైన ఉండే దూలం పూర్తిగా కాలే వరకూ చూదాం లెమ్మని పడుకునే
 ఉన్నాడుట. సత్రం అధికారులు వాడినే అతి గొప్ప సోమరి పోతుగా నిర్ణయించి బలవంతంగా లాగి బయట
పడేసారుట. ఈ కథలో వాస్తవం ఉన్నా, లేక పోయినా తంజావూరు ప్రభువుల దాన శీలత్వం లోక ప్రసిద్ధ
మయినదే . ఇక  యాత్రా కథనం లోకి వద్దాం.

బస్ ముదుంగాతంజావూరు సరస్వతీ మహల్  గ్రంథాలయం చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధ మయిన
ఆ పుస్తక దేవాలయాన్ని దర్శించు కోవడం మా జీవితంలో వొక మధురానుభవం అనే చెప్పాలి.
మేం వెళ్ళిన రోజున గ్రథాలయంలో కొన్ని భాగాలకు మరమ్మత్తులుజరుగుతున్నాయి.ఇదొక పెద్ద
పుస్తక భాండాగారం. ఎందరో సాహితీవేత్తలకు గొప్ప గొప్ప గ్రంథాలు ఇక్కడ ఉపలభ్యమౌతాయి.
సాహిత్య పరిశోధకులకు ఇదొక పెన్నిథి వంటిది.
సరస్వతీ మహల్ గ్రంథాలయం చూసేక తంజావూరు లోని గొప్ప శైవ  క్షేత్రం బృహదీశ్వరాలయం చేరు కున్నాము.
కావేరీ నది ఒడ్డున దక్షినాన ఉండే తంజావూరులో బృహదీశ్వరాలయం అతి పెద్ద శైవ క్షేత్రం.
తంజ – ఆన్ అనే రాక్షసుని ఇక్కడశ్రీ ఆనందవల్లి, శ్రీ నీల మేఘ పెరియాళ్ లు వధించినట్లు ఐతిహ్యం.
అపురూప మయిన శిల్ప కళా వైభవానికి పరాకాష్ఠగా ఈ ఆలయం విలసిల్లుతోంది.1010లో తొలి చోళ రాజ
రాజు నిర్మించిన అతి పెద్ద శైవాలయమిది. దీనికి మూడు ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం
కేరళాంతకన్ కాగా రెండవది రాజరాజన్ తిరువళ్ మరొకటి తిరులేశక్కన్ తిరువళ్. ఇక్కడే వొక పెద్ద నంది
ఉంది. లేపాక్షి తర్వాత దేశంలో అతి పెద్ద నంది ఇదేనంటారు. దాని ఎదురుగా పెద్ద లింగ పీఠం మీద బృదీశ్వర
స్వామి దర్శనమిస్తాడు .బృహత్ అంటే పెద్ద. ఇది చాలా పెద్ద లింగం కనుక దీనికా పేరు వచ్చింది. భక్తుల రద్దీ
 విశేషంగా ఉంది.
గర్భ గుడిలో దక్షిణాన శివుడూ, పడమర వేపు నటరాజు, ఉత్తరాన దేవతామూర్తు విగ్రహాలూ ఉంటాయి.
ఇది సర్వకళా శోభిత మయిన గోపురాలతో కూడిన ఆలయం.
భారత ప్రభుత్వం1954లో తొలి సారిగా 1000 రూపాయల నోటు ముద్రించి నప్పుడు నోటు మీద ఈ
 ఆలయ చిత్రాన్నే ముద్రించారు.  అలాగే 2001లో ఈ ఆలయ చిత్రం ముద్రించిన తపాలా బిళ్ళ
కూడా విడుదల చేసారు.
సర్వతో భద్ర మయిన ఈ బృహదీశ్వరాలయ దర్శనం జీవితంలో మరచి పోలేనిది. అక్కడ చాలా సేపు గడిపి,
మా హొటల్ కి చేరు కున్నాము. ఆ రాత్రి తంజావూరు లోనే బస.
మర్నాడు మా 3వరోజు యాత్రా సందర్భంగా రామేశ్వరం చూసాము, ఆ వివరాలు ప్రస్తుతానికి
సశేషమ్!


























8, మార్చి 2016, మంగళవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... ప్రస్తావన

మా 8 రోజుల తమిళ నాడు యాత్రాదర్శన విశేషాలు
ప్రస్తావన
గత 2015 అక్టోబరు నెలలో మా అన్నదమ్ములం నలుగురమూ ( ఆఖరి వాడు రాలేక పోయాడు)
శ్రీమతులతో సహా కాశీ, గయ, ప్రయాగ యాత్రలు చేసి వచ్చేం. మాతో మా మరదలు హైమ కూడా వచ్చింది.
ఆ యాత్రా విశేషాలన్నీ మా అన్నయ్య ‘‘ మా కాశీ యాత్ర విశేషాలు’’ పేరిట ముఖ పుస్తకంలో వివరగా చక్కగా రాసేడు.
ఈ ఫిబ్రవరి 25 వ తేదీన నేనూ, నా భార్య విజయ లక్ష్మి తమిళనాడు యాత్రలు చేసి వచ్చేము.
తమిళ నాడు టూరిజమ్ వారు ఏర్పాటు చేసిన 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శిని లో బయలు దేరి వెళ్ళి వచ్చేము. అసలు తమిళ నాడు టూరిజమ్ వారి ( ఇక నుండిదీనిని ttdc అని పేర్కొంటాను) ఈ పేకేజీ గురించి, మేము హైదరాబాద్ లో ఉండే రోజులలోనే, ఐదేళ్ళ క్రిందటే మా తమ్ముడు క్ష్మణ్, మరదలు
శారద చాలా బాగుంటుందని చెప్పేరు. వాళ్ళు అప్పటికే వెళ్ళి ఉండడంతో వాళ్ళ అనుభవం మాకు అక్కరకొచ్చింది. ఐతే, ఎప్పటి కప్పుడు వెళ్దాం అనుకుంటూనే తాత్సారం చేసాక, దైవ సంకల్పం వల్ల ఇప్పటి కయింది. ఆ 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలనూ 8 భాగాలలో మీ తో పంచు కోవాలని అనుకుంటున్నాను. సూక్ష్మాంశాలతో పాటూ సవివరంగా రాదామని నాప్రయత్నం. వెళ్ళ దలచు కున్న
వారికి ఉపయుక్తంగా ఉండే లాగున పేకేజీవిరాలూ, ధరవరలూ, వసతులూ, భోజన సదుపాయాలూ షాపింగ్ స్థలాలూ వాటి గురించి చెబుతాను. ఆ యాత్రాస్థలాల గురిచి క్లుప్తంగా నయినా తెలియ జేస్తాను. ఆసక్తి కలవారు అంతర్జాలంలో గూగులమ్మని అడిగితే ఆ యమ ఎలాగూ చెబుతుంది!
పేకేజీ వివరాలు:
తమిళనాడు గవర్నమెంట్ టూరిజమ్ వారి 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శినిలో రాత్రి పూట ప్రయాణాలు ఉండవు. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి వారి టూరిజమ్ హొటళ్ళు ఉండే ప్రాంతాలకి చేరుస్తారు. ఆ హొటళ్ళ లో బస. మళ్ళీ మరు నాడు ఉదయంబ్రేక్ ఫాస్టు అయ్యాక మరో యాత్రా స్థలానికి ప్రయాణం. AC Non Ac బస్సులూ, టూరిజమ్ వారి హొటళ్ళూ ఉంటాయి.
మేము టూర్ కి A C కోచ్ నీ, బసకి AC రూమునీ బుక్ చేసుకున్నాము. ఒక్కో టిక్కెట్టు ధర రూ.14,050. మొత్తం 28,100 ఇచ్చి నెట్లో బుక్ చేసుకుని ప్రింటవుట్ తీసుకున్నాను. ( మనం సీనియర్ సిటిజన్ల మయినా, వికలాంగుల మయినా ఒక్కో టిక్కెట్ కి 20 శాతం నగదు రిఫండ్ యాత్ర పూర్తయాక వెంటనే ఇచ్చేస్తారు !)
ఈ పేకేజీలో మనకి చూపించే యాత్రా స్థలాలు ఇవి:
1పుదుచ్చేరి,2 పిచ్చ వరం 3.చిదంబరం 4.వైదీశ్వరన్ కోయిల్ 5నాగ పట్నం ( నాగూర్) 6 వేలంకిని 7.తంజావూరు 8.రామేశ్వరం 9.కన్యా ుమారి10.సుచీంద్రం11. మధురై12.కొడైకెనాల్ 13.తిరుచ్చి (శ్రీరంగం)
ఇవి కాక దారిలో అదనంగామరో ఇవి కాక పేకేజీలో లేని నాలుగయిదు ముఖ్య స్థలాలను కూడా చూపెడతారు. వీటిలోవైదీశ్వరన్ కోయిల్,
తంజావూర్ ,రామేశ్వరం, కన్యా కుమారి, మధురై, కొడైకెనాల్, తిరుచ్చి లలో రాత్రి బస.
టూరిజమ్ వారి కేంటీన్లలో ప్రతి చోటా ఉదయం స్వీటుతో పాటు నాలుగయిదు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి స్వీటుతో పాటు చక్కని రుచికర మయిన భోజనాలు కొసరి కొసరి వడ్డించేరు. ఎక్కడి క్కడ వాటర్ బాటిళ్ళు కొనుక్కునే వాళ్ళం. పేకేజీ నిబంధనల ప్రకారం ఉదయం టిఫిను తప్పని సరిగానూ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టూరిజమ్ వారే ఇస్తారు. ఏదో ఒక పూట మంచి హోటల్ వద్ద ఆపుతారు. మన ఖర్చుతో నచ్చినవి తీసుకో వచ్చును.
పగటి పూట యాత్ర ముగించుకుని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కోగానే రూమ్ బాయస్ మన సమాన్లు భద్రంగా మనుకు కేటాయించిన గదులకు చేరుస్తారు.
అలాగే మరు నాడు ఉదయమే బస్ వద్దకు చేరుస్తారు. ఎక్కడా టిప్ కోసం చేయి చాపిన దాఖలాలు లేవు.
టూరిజమ్ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం, వారి టూరిజమ్ శాఖ తీసుకుంటున్న శ్రద్ద ఎంతయినా మెచ్చుకో తగినదే. మనతో పాటు ఒక గైడూ, కోచ్ డ్రైవరూ, అతని సహాయకుడూ ఉంటారు. మా గైడ్ పేరు గణేశ్.
మా యాత్ర చెన్నై లో ఫిబ్రవరి 27 శనివారం ఉదయం 7 గంటలకి మొదలై మార్చి 5వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటకి ముగుస్తుంది. కనుక, మేం ఒక రోజు ముందుగా అంటే 26 వ తేదీ నాటికే చైన్నై చేరు కోవాలి. అందుచేత మేం 25 సాయంత్రం 5.45ని.కి విజయ నగరంలో ఎక్కడానికి వీలుగా భువనేశ్వర్,
చైన్నై సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ లో 3rd AC టిక్కెట్లు బుక్ చేసు కున్నాము. అలాగే తిరుగు ప్రయాణానికి చెన్నైలో 5 వ తేదీ రాత్రి 11.45 కి బయలు దేరే హౌరా మెయిల్ లో టిక్కెట్లు బుక్ చేసు కున్నాము.
ఐతే, స్లీపరు క్లాసు తప్ప ఎ.సి దొరక లేదు. సరే లెమ్మనుకున్నాం.టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇక ప్రయాణం తేదీ కోసం ఎదురు చూడడమే !
మద్రాసుకి ప్రయాణంతో మొదలయ్యే మా తమిళ నాడు యాత్రా దర్శిని రోజు వారీ వివరాలు సశేషమ్!