తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మార్చి 2016, ఆదివారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...Day 5 (2-3-2016)

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  ...Day 5 (2-3-2016)

ఉదయాన్నే తయారయి పోయేం. నిన్నఫెర్రీ సర్వీసులు రద్దు అయి పోవడం వల్ల వివేకా
నంద మెమోరియల్ రాక్ టెంపుల్ దగ్గరకు వెళ్ళ లేక పోయాం. ఇవాళయినా వీలవుతుందో లేదో
అనుకుంటూ,  సముద్రం మీద సూర్యోదయాన్ని చూడడానికి  నేనూ, మా ఆవిడా,
మురళీ కృష్ణ గారూ, రాధ గారూ, విజయ లక్ష్మి గారూ బయలు దేరాము.అప్పటికి ఉదయం
 ఐదవుతోంది.
ఇవాళ సూర్యోదయం 6.20కి జరుగుతుందని అక్కడ చెప్పేరు.  నేటి ఉదయం చూడ వలసి ఉన్న
 సుచీంద్రం నిన్న సాయంత్రమే చూసి రావడం వల్ల మా మధురై ప్రయాణానికి ఏమంత తొందర లేదు.
సూర్యోదయ సూర్యాస్తమయాలు చూడడానికి కట్టిన వలయాకారపు మెట్లున్న వ్యూపాయింట్
కట్టడం మా హొటల్ గదికి ఎదురుగా నడక దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్తూ, దారిలో కాఫీలు
దొరికితే కావలసిన వాళ్ళం త్రాగేం. వ్యూపాయింట్ టిక్కెట్టు మనిషికి పది రూపాయలు.
టిక్కెట్లు తీసుకుని మీద అంతస్తుకి చేరు కున్నాం. అక్కడి నుండి మూడు వేపులా
సముద్రం అందంగా కనిపిస్తోంది. ఆ ఉదయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. సముద్రపు గాలి
 మనసును ఉల్లాస పరుస్తోంది. మా దృష్టి అంతా  తూర్పు దిక్కు వేపే సారిచి ఆనందామృతాన్ని
 జుర్రు కోవాలని ఆసక్తిగా చూస్తున్నాం. చీకట్లు విడి పోయి, తెల తెలవారుతోంది. ఆకాశం క్రమేపీ రాగ
 రంజిత మవడం  చూదామనుకుంటున్న మాకు అవేళ ఆ కోరిక తీర లేదు! మబ్బులు అడ్డొచ్చాయి.
సూర్యోదయం చూడ లేక పోయేము.అయ్యో ! అనుకున్నాం. సూర్యోదయ వేళ దాటి పోయి,
అప్పటికే పావుగంట పైగా అయింది.మబ్బు రుమాలు ముఖాన కప్పుకుని మాతో దోబూచు
లాడడం తగునా ? ఎంత పని చేసావయ్యా, దినకరా !అనుకుంటూ వ్యూపాయింట్  నుండి దిగి
క్రిందకి వచ్చేము. ఇక ఫెర్రీ సర్వీసులు ఇవాళ ఉదయం ఉంటాయో, నిన్నటి  సాయంత్రంలాగే
 రద్దవుతాయో అనే శంకతో ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించేము. హొటల్ రూముకి వెళ్ళే
పని లేదు కనుక, నేరుగా ఫెర్రీలు బయలుదేరే చోటికే వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకున్నాం.
మేం అయిదుగురం ఫెర్రీలు బయలుదేరే చోటే ఉంటామని మా గైడ్ కి  ఫోన్ చేసి చెప్పేము.
మొదటి  ట్రిప్పు ఫెర్రీ 8.15 గంటలకి బయలు దేరుతుందిట. ఇకా చాలా టైముంది. అక్కడికి  చేరు
కున్నాము. అక్కడ ఫెర్రీ ఎక్కేందుకు క్యూ కనిపించి హమ్మయ్య! అనుకున్నాం. మురళీ కృష్ణ
గారు హిందూ పేపరు కొనుక్కుని వో షాపు మెట్ల మీద కూర్చుని పేపరు  చదువుకుంటూ గడిపేరు.
ఆడవాళ్ళు ముగ్గురూ అక్కడే వో షాపులో కుర్చీలు ఆక్రమించి కబుర్లు చెప్పుకుంటూ గడిపేరు.
నేను మరో కప్పు కాఫీ సేవించి అటూ యిటూ తచ్చాడుతూ గడిపేను. ఎనిమిదవుతూ ఉంటే మా
గైడ్ మిగిలిన వారిని వెంట పెట్టుకుని వచ్చేడు. ఫెర్రీ టిక్కెట్ల ఖర్చు టూరిజమ్ వారిదే కనుక
టిక్కెట్లుకొని మమ్మల్ని రాక్ టెంపుల్ దగ్గరకి బయలుదేర దీసాడు.

అందరం ఫెర్రీ ఎక్కేము. మురికి పట్టిన లైఫ్ జాకెట్లు వేసు కోవడం ఈ సారి కూడా తప్ప లేదు!
పది నిముషాల లోపే రాక్ టెంపుల్ కి చేరుకున్నాం. తిరువళ్ళవూర్ భారీ విగ్రహాన్ని దూరం నుండే
చూసేము. ఈ తమిళ కవి విగ్రహం133 అడుగుల ఎత్తుతో,ఏడున్నర టన్నుల బరువుతో
ఆసియాలోనే భారీ విగ్రహ మని చెబుతారు.
స్వామి వివేకానంద 1892 ప్రాంతంలో బారలు వేసుకుంటూ సముద్రాన్ని ఈది వెళ్ళి అక్కడి కొండ మీద
 ధ్యానం చేసుకునే వాడని నిన్నటి కథనంలోనే చెప్పేను కదా. స్వామి స్మృత్యర్ధంనిర్మించిన
ఈ రాక్ టెంపుల్ అందాలు  చూసి తీర వలసినదే. సముద్రపు హోరు, విసురు గాలి సమ్మోహన
 పరుస్తాయి. స్వామి ధ్యానం చేసిన చోటుని దర్శించు కున్నాము. మంద్ర స్వరంలో ఓంకారం
తప్ప మరే ధ్వను లూ విని పించని ఆ ధ్యాన మందిరంలో కొద్ది సేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాము.
  ధ్యానం కుదరక పోయినా, అలా కూచోడం వల్ల వొక ప్రశాంత మయిన అలౌకికానుభూతి కలిగి మనసు
తేట పడిన భావన కలిగి నట్టనిపిస్తుంది.
రాక్ టెంపుల్ మీద స్వామి సాహిత్య గ్రంథాలు విక్రయించే షాపులు ఐదారు వరకూ ఉన్నాయి.
హాయి గొలిపే ఆ వాతా వరణాన్ని వదిలి రావాలనిపించక పోయినా, యింకా బ్రేక్ ఫాస్టు చేసి
మధురై వెళ్ళ వలసి ఉంది కనుక హొటల్ గదులకు చేరుకుని లగేజీలను బస్ డిక్కీలో చేర్పించి హొటల్
 లో టిఫిన్లు కానిచ్చేము. ఈ రోజు చూడ వలసిన సుచీద్రం నిన్ననే చూసి
రావడం వల్ల సమయం కలిసి వొచ్చి, టిఫిన్లయ్యేక తీరికగా 10 గంటలకి బస్ ఎక్కి మధురై బయలు
దేరాము.
2 గంటల ప్రాంతంలో తిరుమంగళమ్ అనే చోట లంచ్ చేసాము. ఈ ఖర్చు మాదే. లంచ్ తర్వాత
బయలు దేరి 3 గంటలకి మధురై చేరు కున్నాము.

అక్కడ ముందుగా నాయక రాజుల రాజ మహల్ చూసేము. మేం చూసిన మహలు అసలు
మహలులో నాలుగో వంతు మాత్రమేననీ తక్కిన రాజప్రాసాదాలు శిధిలం కావడంతో పర్యాటకులకు
అనుమతి లేదనీ తెలిసింది. మేం చూసినంత మట్టుకే రాచ మహలు చాలా గొప్పగా విశాలంగా ఉంది.
ఆ నిర్మాణ కౌశల్యం అధ్భుతం నిపిస్తుంది. పెద్ద పెద్దహాళ్ళూ, ప్రాసాదాలూ, సభా భవనాలూ, యక్ష గాన
 ప్రదర్శనల  వేదికలూ చక్కని వర్ణ చిత్రాలతో కనుల పండువు చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఒక్కో స్తంభమూ ముగ్గురు వ్యక్తులు చేతులు బారచాపి కొలిచినా చాలనంత చుట్టు కొలత
కలవి. రాజులు ఉపయోగించిన కొన్ని వస్తువులూ, కొన్ని శిల్పాలూ కూడా ప్రదర్శనకి ఉంచారు.
రాచ ప్రాసాదాలు చూసేక, మధురై లోని  మీనాక్షీ అమ్మ వారి దర్శనానికి బయలు దేరాము.

కంచి కామాక్షి తల్లిని లోగడ మూడు పర్యాయాలు దర్శించు కున్నాం, కానీ  మధుర మీనాక్షి అమ్మ
వారి దర్శనం ఇదే  మాకు మొదటి సారి. దీనితో కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మ
వార్లను మేం దర్శించుకున్నట్టయింది. ఈ మూడూ అష్టాదశ శక్తి పీఠాలలోనివే.


మధురైలో మీనాక్షి అమ్మ వారి కోవెల భారత దేశం లోనే వొక అపూర్వ మైన కట్టడమని చెప్ప వచ్చును.
ఇక్కడి శిల్ప కళ, ఎత్తయిన గోపురాలూ వర్ణ శోభితమై లరారుతూ ఉంటాయి.
1600 ప్రాంతంలో కుల శేఖర పాండ్యుడనే పాండ్య రాజు దీనిని నభూతో న భవిష్యసి అనే రీతిలో
నిర్మిచాడు. 45 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ 14 గోపురాలతో ఈ ఆలయ నిర్మాణం ఉంది.  ఈ గోపురాలలో
ఎత్తయినది 170 అడుగులు కావడం విశేషం. ఇందులో రెండు గోపురాలకు బంగారు తాపడం చేసారు.
పసిడి వర్ణంతో అవి మెరిసి పోతూ ఉన్నాయి.
ఇక్కడ పరమ శివుడు సుందరేశ్వర స్వామి గానూ, పార్వతీ అమ్మ వారు మీనాక్షీ అమ్మ వారి గానూ
కొలవబడుతున్నారు.  ఆలయంలో గోడల మీద ఎక్కడా కొద్ది పాటి ఖాళీ కూడా లేకుండా చక్కని
శిల్పాలు,  వర్ణ చిత్రాలు ఉన్నాయి. తనివి తీరా ఆలయ దర్శనం చేసు కున్నాక, 6.30కి మధురై
లోని హొటల్ కి చేరు కున్నాము. లగేజీ హొటల్ గదులలో చేర్చుకుని, కాస్త విశ్రమించి, రాత్రి 8 గటలకి
టూరిజమ్ వారి హొటల్ లోనే డిన్నరు కానిచ్చేము.

మర్నాడు మా  6వ రోజు యాత్రలో భాగంగా విహార స్థల మయిన కొడైకెనాల్ కి ప్రయాణం.
ఆ ముచ్చట్లు చెప్పు కునే ముందు ఇప్పటికి శలవ్.



































  





12, మార్చి 2016, శనివారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు Day 04 (1 – 3 -2016 )

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు  Day 04 (1 – 3 -2016 )
మా తమిళ నాడు యాత్రలో ఈ రోజు మా ప్రయాణం కన్యా కుమారికి. అయితే, మా పేకేజీలో లేని మరో రెండు
ఆలయాలను మా గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, కన్యా కుమారికి గురిచి చెబుతాను.
ఉదయం బ్రేక్ ఫాస్ట్  రామేశ్వరం లోని టూరిజమ్ వారి హొటల్ లోనే తీసు కున్నాము. కన్యా కుమారి అక్కడికి 350
350 కి.మీ దూరంలో ఉంది. ఉదయం 7.15ని.లకే టిఫిన్ లు కానిచ్చి బయలు దేరాము.

8.30 కి వొక చిన్న ఆలయం దగ్గర బస్ ఆగింది. అక్కడ వొక హనుమాన్ టెంపుల్ ఉది.
హనుమ విగ్రహం పెద్దదే. అక్కడే వొక వ్యక్తి మాకు నీటిలో తేలే రాళ్ళు చూపించేడు.
రాళ్ళు నీటిలో బెండుల్లా తేలడం అబ్బురమే. అలాంటి రాళ్ళు అక్కడ కొద్ది పాటి మాత్రమే ఉన్నాయి. అలాటి
రాళ్ళ మీదే శ్రీరామ అని వ్రాసి వానరులు సముద్రంలో వేసి లంకకు వారధి నిర్మించారుట!
వొక నీటి తొట్టిలో ఉన్న నాలుగయిదు రాళ్ళను కదిపి చూసేము.
రాముడు ధనుష్కోటి ప్రాంతంతలో నిర్మించిన సేతువు సమద్ర గర్భంలో కలిసి పోగా, అక్కడ నుండి
సేకరించి తెచ్చిన రాళ్ళు కొన్ని ఇక్కడ ఉంచి భక్తులకు చూపుతున్నట్టుగా చెప్పారు.
ఇది చూసేక, బస్ మళ్ళీ బయలు దేరింది. మరో గంట తర్వాత 9.30వొక చోట ఆది జగన్నాథ
స్వామి వారి కోవెల దగ్గర దర్శనార్ధం బస్ ఆగింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ పూరి అని వ్యవహరిస్తారుట.
ఇక్కడ ఆలయంలో శయన ముద్రలో ఉన్న శ్రీరాముడు దర్శనమిస్తాడు. కుడి చేతిని తల కింద పెట్టుకుని
సీతాన్వేషణ ఎలా చేయాలా ! అని ఆలోచిస్తున్నట్టుగా శ్రీరామ మూర్తి శయన భంగిమలో ఆలోచనా ముద్రలో
కనిపిస్తాడు.  అర్చకులు ఆలయానికి చెందిన ఈ ఐతిహ్యం చెప్పారు. గర్భ గుడికి వెలుపల శ్రీరాముడిని
అవలోకిస్తూ శరణా గతి భంగిమలో విభీషణుని విగ్రహం ఉది. మరో ప్రక్క సముద్రుని విగ్రహం కూడా ఉంది.
మరో ప్రక్క పట్టాభిరాముని విగ్రహాలు చూడ ముచ్చటగా ఉన్నాయి.
సరే, ఇక్కడి నుండి బయలు దేరి, లంచ్ కి అవకాశం లేక పోవడంతో వొక చోట ఆపితే స్నాక్స్  అరటి
పళ్ళతో కడుపు నింపు కున్నాము.
నాలుగు గంటలకి కన్యా కుమారి చేరు కున్నాము.
కన్యాకుమారి చాలా అందమయిన ప్రదేశం. భారత ద్వీప కల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రాంతం.
అందుకే దీనిని కన్యా కుమారి అగ్రం అని అంటారు. ఇదొక ముఖ్య పర్యాటక కేంద్రం.పడమటి కనుమలలో
ప్రకృతి సిద్ధ మయిన అందాలతో అలరారే ప్రదేశం. ఇది బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం,
హిందూ మహా  సముద్రం కలిసే చోటు.  ఆ మూడు సముద్రాల జలాలు అక్కడ కన్యా కుమారిగా వెలిసిన
 పార్వతీ దేవి దివ్య పాదాలను తెల్లని కెరటాలతోనూ, నురుగులతోనూ  తడుపుతూ ఉంటాయి.
ఇక్కడి సైకత రేణువులుథోరియం ధాతువులతో కూడి ఉండడం వల్ల శక్తిమంతములై, పవిత్రమెలైనవిగా
భావిస్తారు. వారణాసి శివుడికీ, కన్యా కుమారి పార్వతీ దేవికీ నివాస స్థలాలుగా చెబుతారు.

ఇక్కడ కన్యా కుమారి ఆలయ దర్శనంతో పాటూ విశేష ఆకర్షణగా నిలిచేవి సముద్ర జలాలలో
కనుల పండువుగా కనిపిస్తూ ఉండేవివేకానంద  స్వామి మెమోరియల్ రాక్ టెంపుల్. 1892ప్రాంతంలో
వివేకానందుడు సముద్రాన్నిఈదుతూ వెళ్ళి అక్కడి కొండమీద ధ్యానం చేసే వారట!
స్వామి స్మారకార్ధం ఆ కొండ మీద వొక చలువ రాతి ధ్యాన మందిరాన్ని నిర్మించారు.
దానికి కొంత సమీపంలో  తమిళ కవి తిరువళ్ళవర్ భారీవిగ్రహం అబ్బుర పరుస్తూ ఉంటుంది.
133 అడుగుల ఎత్తుతో, ఏడున్నర టన్నుల బరువుతో ఉండే ఆ విగ్రహాన్ని 2000సం.లో
ముఖ్య మంత్రి కరుణా నిధిఆవిష్కరించారుట. ఇక్కడకీ,సముద్రలో రాక్   టెంపుల్ వద్దకూ వెళ్ళడానికి
పడవలలోనే వెళ్ళాలి.  ఫెర్రీ సర్వీసులు ఉంటాయి.  కానీ, ఆ రోజు సాయంత్రం అలల ఉధృతి ఎక్కువగా
 ఉడడంతో ఫెర్రీ సర్వీసులను రద్దు చేసారు. అందరం ఎంతో నిరుత్సాహ పడ్డాం. కానీ మా గైడ్ నిరుత్సాహ
 పడ వద్దనీ, యాత్రలో చిన్న మార్పు చేసి మరునాడు 5 వరోజు యాత్రలో  ఉదయం చూడ వసి ఉన్న
సుచీంద్రానికి ఆ సాయంత్రమే తీసుకుని వెళ్తాననీ, అందు వలన సమయం కలసి వచ్చి,
మరునాడు ఉదయం ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరిస్తే వివేకానంద రాక్ టెంపుల్ ని చూడ వచ్చనీ చెప్పాడు.

అందు చేత  సుచీంద్రం వెళ్ళడానికి ముందుగా కన్యా కుమారిలో గాంధీ మెమోరియల్ భవనం చూసేము.
అక్కడ మహాత్ముని అస్థికలుంచిన పాత్ర నిక్షిప్తం చేసిన పాల రాతి కట్టడం ఉంది. దాని మీద గాంధీ
జయంతి అక్టోబరు 2న  మాత్రమే సరిగ్గా పన్నెండు గంటలకి నేరుగా సూర్య కిరణాలు పడడం విశేషమని
 చెప్పారు. తర్వాత ఇక్కడ కన్యా కుమారి ఆలయాన్ని దర్శించు కున్నాం.ఆతర్వాత అంతా బస్ ఎక్కాము .
 బస్ 5.45 ని.లకి సుచీంద్రం చేరింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కోవెలలో
 విశేషాంశం ఏమిటంటే, సంగీతం వినిపిచే స్తంభాలు. గైడు వాటి మీద లయ బద్ధంగా వాయించేడు. స్తంభాల
నుండి చెవి వొగ్గితే  మూడు నాలుగురకాల వాయిద్యాల సంగీతం ప్రతిధ్వనించింది. రాళ్ళు కూడా రాగాలు
పలకడం అంటే ఇదే కదా అనుకున్నాము.

సుచీంద్రం చూసుకుని 7.30కి తిరిగి కన్యాకుమారి చేరు కున్నాము. టూరిజమ్ వారి హొటల్ గదులలో
చేరి, విశ్రాంతి తీసుకుని ఎనిమిదిన్నరకి వారి హొటల్ లో డిన్నరు తీసు కున్నాము.

మర్నాడు ఉదయమే లేచి,  కన్యా కుమారిలోసూర్యోదయాన్ని చూడాలని, ఫెర్రీలు తిరిగితే
వివేకానంద మెమోరియల్ రాక్ టెంపుల్ చూడాలనీ ఉవ్విళ్ళూరుతూ నిద్రకి ఉపక్రమించాము.
శలవ్.

















మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Dayn 03 (29 -02-2016)

మా 8 రోజుల తమిళ నాడు  యాత్రా విశేషాలు  Day 03 ( 29-2-2016)
ఉదయం బ్రేక్ ఫాస్ట్  తంజావూరు టూరిజం వారి హొటల్ లోనే చేసి,మా మూడవ రోజు యాత్ర కోస8.30 ని. బయలు దేరాము.
కి బయలు దేరాం. మా ప్రయాణం రామేశ్వరానికి.   కానీ, దారిలో మా పేకేజీలో లేని మరో రెండు
దేవాలయాలను గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, రామేశ్వరం గురించి చెబుతాను.
బస్ హైవేలో చాలా దూరం ప్రయాణం చేసాక, 9.30 ప్రాంతంలో వొక చోట సైడు రోడ్డు పట్టింది.
ఈ రోడ్డు ప్రయాణానికి మరీ అంత సుఖంగా లేదు. దాదాపు గంట  తర్వాత పెరుమియమ్ అనే
చోటుకి చేరుకున్నాం.  ఇక్కడ శయన భంగిమలో ఉన్న మహా విష్ణువు ఆలయం ఉంది.
 మహా విష్ణువు శ్రీదేవి, భూ దేవీ సహితుడై ఉంటాడు. నాభి నుండి పద్మం, దాని మీద బ్రహ్మ ఉంటాడు.  ఇదొక గుహాలయం.  పెద్ద కొండ గుహలో ఉంది. చూడ తగిన ఆలయమే. భక్తుల రద్దీ సామాన్యంగా ఉంది. పర్వ దినాలలో భక్తులు పోటెత్తుతారేమో  అనుకుంటాను.
 తొండమాన్ చక్రవర్తి దీనిని నిర్మించాడని  చెప్పారు. తిరుమల నిర్మాణాలలో ఈ ప్రభువు ప్రమేయం
చాలా ఉంది. శ్రీ వారి ఆలయంలో వీరి కంచు విగ్రహం ఉంది . శ్రీ మహా విష్ణువును దర్శించు కున్నాక
కోవెల బయట సమీపంలో లోనే వొక చిన్న గుహ చూపించాడు. వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఇక్కడే
 తలదాచు కుని ఆంగ్లేయుల చేతికి చిక్కాడని చెబుతారు.  గుహ చాలా ఇరుకుగా ఉండి చొర రానిదిగా
 ఉంది.
 దీని తర్వాత బయలు దేరి సుమారు 11.30 గంటల ప్రాంతంలో చటివాడ అనే చోట  వొక పెద్ద గణపతి
 ఆలయం  చూసేము. ఈ గణపతి కరగాసురుడు అనే రాక్షసుని సంహరించాడని స్థల పురాణం చెబు
తోంది. ఇక్కడి రాతి విగ్రహం చాలా పెద్దది. ఇది కూడా చూడ తగినదే.
2 గంటల ప్రాంతంలో  రామేశ్వరం వరకూ సముద్ర తీరాన వేసిన రైల్వే ట్రాక్,సముద్రంలో షిప్ లు
 వస్తే దారి ఇస్తూ రెండుగా చీలి పోయే అద్భుత మయిన రైలు వంతెనా ఉన్నాయి.
( హౌరా బ్రిడ్జి కూడా ఇలాంటిదే) దీని పొడవు దాదాపురెండున్నర కి.మీ ఉంటుందిట.ఇది కాక
ఎడమ వేపు ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన  రోడ్డు వంతెన కూడా ఉంది.
ఇక్కడ సముద్రం నీల వర్ణ శోభితమై కనుల పండువుగా ఉంటుంది. ట్రాఫిక్ కి అడ్డు లేకుండా మా బస్
 వో ప్రక్కగా ఆపి దిగి చూసి వేగిరం రండని గైడ్ చెప్పడంతో అందరం పొలోమని కెమేరాలతో
బస్ దిగేం. ఆ వంతెనలు. సముద్రం ఆ దృశ్యాలు ఎంత చూసినా తనివి తీరేలా లేదు. కాసేపు
ఫొటోలు తీసు కున్నాక, బస్ ఎక్కాము. బస్ బయలు దేరింది. రామేశ్వరానికి చేరు కోడానికి
ముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సమాధి బస్ లోనుండే చూపించాడు.  మరి కొంత
దూరం వెళ్ళాక శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్ప బడుతున్ననలుచదరంగా ఉండే
నవగ్రహ మండపం ఉంది. సముద్రపు అలలు కప్పి వేయడంతో ఐదు గ్రహాలు మాత్రమే బయటకి
కనబడుతూ తక్కిన నాలుగూ నీటిలో కనబడుతూ న్నాయి. మూడు ప్రక్కలా అనంత మయిన
సముద్ర జలాలను చూస్తూ, రాతి పలకల చప్టా మీద ఆ నవగ్రహాలనూ దర్శిచు కోవడం
వొక మధురానుభూతి అనే చెప్పాలి.
రాముడు ప్రతిష్ఠించిన నవగ్రహాలనూ దర్శిచు కున్నాక బస్ ఎక్కాము. రామ నాథంలో లంచ్ .
ప్రైవేటు హొటల్. చాలా పెద్దదే. గైడ్ సూచనతో  ఉదయం టిఫిన్ లు కాస్త హెవీగా ఉడడంతో ఆకళ్ళు
 లేక మేమూ మురళీ కృష్ణ గారూ పూర్తి భోజనం కాకుండా పెరుగన్నాలు మాత్రం తెప్పించుకు తిన్నాం. పెరుగన్నం
పెరుగన్నం కమ్మగా ఉంది. వారి కుటుంబ సభ్యులు రాధ గారూ విజయ లక్ష్మి గారూ  ఆకలి లేక
పోవడంతో పెరుగన్నం కూడా తీసుకో లేదు.అరటి పళ్ళు తినిఊరుకున్నారు.
      లంచ్ అయ్యాక, బస్ ఎక్కాం. బస్  సాయంత్రం నాలుగు గంటలకి రామేశ్వరం చేరుకుంది.
       టూరిజమ్ వారి హొటల్ చేరుకుని గదులలో ప్రవేశించాము. ఆలస్యం చెయ్యకుండా
        రామేశ్వరలో స్నానాలకు కావలసిన బట్టలు పోలథిన్ కవర్లలో పెట్టుకుని బయలు దేరేం.
        స్నానాలకీ, గుడి లోకీ వెళ్ళ వలసి ఉంటుంది కనుక సెల్ ఫోన్ లూ, కెమేరాలూ హొటల్
         గదిలోనే ఉంచేసాము.
        అక్కడ సముద్ర స్నానం చేసాక కోవెలలో ఉన్న 21 బావులలో స్నానం చేయాలంటారు.
        ఆ తర్వాత పొడి బట్టలు కట్టుకుని రామనాథ స్వామి దర్శనం చేసు కోవాలి. డబ్బులు తీసుకుని
        బావులలో నీరు తోడి పోయడానికి  కొందరు వ్యక్తులు ఉంటారు. మా గైడ్ మాకూ, మురళీ కృష్ణ
గారి కుటుంబానికీ వొక తెలుగు వచ్చిన వ్యక్తిని కుదిర్చి పెట్టాడు. అతడు మనిషికి వంద రూసాయల
చొప్పున  వసూలు చేసాడు. సముద్ర స్నానాలు చేయడానికి వీలుగా ఘాట్ లు ఉన్నాయి.
 ముందుగా  మేము సముద్ర స్నానాలు చేసి, ఆ తడి బట్టలతోనే కోవెల లోనికి వెళ్ళి 21 బావులలో
ఆ వ్యక్తి నీరు తోడి పోస్తూ ఉంటే స్నానాలు చేసాము.ఇక్కడ నీళ్ళు తోడి పోసే వాళ్ళు మనల్ని బావి నుండి
 బావికి పరుగులు పెట్టిస్తూ ఉంటారు. లోగడ ఒక్కో నూతికీ నీళ్ళు తోడి పోయడానికి పావలా చొప్పున యిచ్చి
స్నానాలు చేసామని రాధ గారు చెప్పేరు.
నూతులలో స్నానాలు అయ్యేక పొడి బట్టలు మార్చుకుని ( బట్టలు మార్చు కోడానికి అక్కడ సదుపాయం
ఉంది)  రామనాథ స్వామి దర్శనం చేసు కున్నాము. కాశీ నుండి  మేము తెచ్చిన గంగను
అక్కడి పూజారులకి ఇస్తే సైకత లింగానికి అభిషేకం చేసారు.
ఈ బావుల వివరాలు:
1.మహా లక్ష్మీ తీర్ధం  2. సావిత్రీ తీర్ధం  3. గాయత్రీ తీర్ధం  4.సరస్వతీ తీర్ధం   5.సేతు మాధవ తీర్ధం    6. గంధమాదన తీర్ధం   7.కవచ తీర్ధం   8.గవయ తీర్ధం  9. నత తీర్ధం  10. నీల తీర్ధం  11. శంఖర తీర్ధం  12.చక్ర తీర్ధం  13.బ్రహ్మ హత్యా పాతక విమోచన తీర్ధం  14. సూర్య తీర్ధం   15. చంద్ర తీర్ధం   16. గంగా తీర్ధం   17. యమునా తీర్ధం   18. గయా తీర్ధం   19.  శివ తీర్ధం   20 సత్యామృత తీర్ధం  21 సర్వ తీర్ధం 22 కోటి తీర్ధము.


ఇక్కడ రామేశ్వరం గురించిన కొన్ని వివరాలు చెబుతాను ...
రామేశ్వర ఒక ద్వీపం.ఈ ద్వీపాన్ని ప్రధాన భూభాగం నుడి పంబన్ కాలువ వేరు చేస్తోంది.
ఈ ద్వీపం శంఖు ఆకారంలో ఉంటుందంటారు. సుముద్రం అవతలి తీరాన శ్రీలంక
 రాజధాని కొలంబో ఉంది. ఇక్కడి స్వామి రామనాథ స్వామి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొకటి. ఇది
సైకత(ఇసుక) లింగం. రావణ సంహారానంతరం బ్రహ్మ హత్యా పాతకం నుడి తప్పించు కోడానికి శ్రీరాముడు
లింగ ప్రతిష్ఠ చేయ దలచాడు. హనుమంతుడిని కైలాసం వెళ్ళి ప్రతిష్ఠ కోసం శివ లింగాన్ని తెమ్మని
పంపించేడుట. కానీ  సమయానికి హనుమ లింగం తీసుకుని  రాక పోవడంతో  ముహూర్తం మించి పోకుండా
 శ్రీరాముడు సీతమ్మ వారు చేసిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడుట. తరువాత  కైలాసం నుండిలింగంతో
వచ్చిన హనుమంతుడు అలిగాడుట. అప్పుడు రాముడు ఆ లింగాన్ని కూడా ప్రక్కనే ప్రతిస్ఠించి,
దానికే ముందు పూజలు జరుగుతాయని మాట యిచ్చాడుట.
రామేశ్వరంలో ప్రభాత సమయాన వెళ్ళి స్ఫటిక లింగాన్ని కూడా దర్శించు కోవచ్చును. మాకు అవకాశం
లేక పోయింది. ఇక్కడ వానర సేన సాయంతో   శ్రీరాముడు సముద్రానికి వారధి నిర్మిచాడుట,.
 నీళ్ళపై తేలే రాళ్ళతో దీనిని నిర్మించాడంటారు. ఇలాంటి రాళ్ళని రామేశ్వరంనుండి తిరుగు ప్రయాణంలో
 వొక చిన్న గుడిలో చూసేము. ఈ రామ సేతువు రామేశ్వరంలో ధనుష్కోటి నుండి శ్రీ లంక వరకూ
వ్యాపించి ఉండేదిట.సముద్ర గర్భాన నాసా వారు ఇటీవల దీని ఉనికిని నిర్ధారించేరు.

రాత్రి 8 గటల ప్రాంతంలో హొటల్ కి చేరుకుని డిన్నర్ అయ్యేక విశ్రమించేం.
మర్నాడు 7.30కి కన్యాకుమారికి  మా ప్రయాణం. అందు వల్ల వేకువనే లేచి తయారైపోయి, నేనూ,
మా ఆవిడా మరో సారి సముద్రపు ఘాట్ వద్దకు వెళ్ళాం. మా ఆవిడ అక్కడి ఇసుకను
కొంత సేకరించింది. దీనిని తీసుకుని వెళ్ళి కాశీలో గంగలో కలపాలిట. ( ఈ సారి కాశీలో 9 రాత్రులు
నిద్ర చేయాలని మా సంకల్పం. ఆ కాశీ నాథుని దయ. )
మా తమిళ నాడు యాత్రలలో భాగంగా 4 వ రోజు కన్యా కుమారి యాత్ర గురించిన
వివరాలు ఇప్పటికి సశేషమ్.