10, మే 2010, సోమవారం

కమనీయ ఖండ కావ్యం - కాటూరి వారి ‘ పౌలస్త్యహృదయం ’.

కాటూరి వేంకటేశ్వర రావు గారి ఖండ కావ్యము -

‘పౌలస్త్యహృదయం








శ్రీమహా విష్ణువు వైకుంఠంలో కొలువు తీరి ఉండగా సనకసనందనాదులు శ్రీవారి దర్శనార్ధం వచ్చేరు. ద్వార పాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. మునులు కోపించి, వారిని రాక్షసులుగా పుడుదురుగాక ! అని శపించారు. విష్ణువు మునులకు దర్శనమిచ్చి, జయ విజయులకు అమోఘమైన మునుల మాటలు తథ్యములని చెప్పి, వైరభక్తితో వారు కాలాంతరమున తనతో ఐక్యం కాగలరని వరం ప్రసాదించాడు. అలా జన్మించిన రాక్షప వీరులే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు , రావణ కుంభ కర్ణులు , శిశుపాల దంతవక్తృలు . ఈ కథ అందరికీ తెలిసిందే కదా ?

శ్రీరాముడు రావణసంహారార్ధం లంకా నగరం చేరుకునేందుకు సముద్రతీరం చేరుకున్నాడు. వారధిని కపి సేన నిర్మించనారంభించింది.
అక్కడ లంకలో రావణుడు ఎన్నడూ లేనిది సాగరుడు రవంత సంభ్రముడై ఉండడాన్ని గమనించి, అతనితో పలికిన పలుకులివి.

కాటూరి వేంకటేశ్వర రావు గారు ‘‘ పౌలస్త్య హృదయం ’’ కావ్య ఖండికలో ఈ ఘటన అపూర్వంగా చిత్రీకరించారు. మరిచి పోతున్న ఆ మంచి రసవంతములైన పద్యాలను మిత్రులతో మరొక్క మారు పంచుకోవాలని ఇది రాస్తున్నాను ....

ఆ ఖండ కావ్యంలోని పద్యాలను అక్కడక్కడ ఉటంకిస్తూ వచన రూపంలో అందిస్తున్నాను ....

సముద్రుడు ఆనాడు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాడు. ఏదో భయోద్వేగంతో నురగలు క్రక్కుతున్నాడు. అది చూసి రావణుడు సాగరుని ఉద్దేశించి ఇలా అంటున్నాడు :

నురుగుల్ గ్రక్కుచు నూర్పు సందడుల
మిన్నుల్ ముట్ట నొక్కుమ్మడిన్
బరుగుల్ ద్రొక్కుచు శీర్ణ కేశముల
నుద్బాహుండవై వచ్చుత
త్తఱమున్ గాంచిన నుత్తలంపడెడిఁ
జిత్తంబీ భయోద్వేగమె
వ్వనిచే నీ కొనగూడె నర్ణవ పతీ !
వాక్రుచ్చవయ్యా వెసన్.

మిన్నంటేలా నురగలు క్రక్కుతూ పరుగులు పెడుతూ తత్తరపాటుతో వస్తున్నావేమయ్యా ? ఎవరి చేతనయ్యా, నీకీ భయోద్వేగం కలిగింది ? ఓ సాగరా ! వేగిరం చెప్పవయ్యా ...

కేవలం కను బొమల కదలిక చేతనే మూడు లోకాలకీ విలయాన్ని చేకూర్చ గల వారలమే !నా అండ నీకుండగా ఎందుకయ్యా ఇంత భయం ?

నాకూ నీకూ భయం అనే మాట ఎన్నడూ విన లేదే ? ఇవాళ నీ విలా వణికి పోతూ ఉండడానికి కారణం కనిపించడం లేదు. సూర్యుడు ఎప్పటిలాగే వెలుగుతున్నాడు. గాలి మునపటిలాగే వీస్తున్నది. ప్రళయ కాల గర్జనలు వినిపించడం లేదు. తారకలు రాలడం లేదు. చంద్ర రేఖ నా చేయి జార లేదు. నీ ఉదరంలో బడబాగ్ని చల్లార లేదు. ఎందుకీ భయమయ్యా , రామ చంద్రుని ధనుష్టంకారం నిన్ను భయకంపితుని చేసినదా యేమి ?

ఏమేమీ ! మళ్ళీ చెప్పూ, రామ చంద్రుడు లంకకి దండెత్తి వస్తున్నాడా ! మరింకేమీ ... భయం విడిచి పెట్టు. రామచంద్ర ప్రభువుకి త్రోవ విడిచి పెట్టు ...అతనికీ అతని తమ్ముడు లక్ష్మణుడికీ, సూర్య తనయుడు సుగ్రీవునకూ, హనుమకీ ఇతర వానర సేనకీ దారి విడువ వయ్యా ...

ఎన్నాళ్ళకు ! ఎన్నాళ్ళకు !
కన్నులు వింశతియు నాకుఁగల్గిన ఫలమా
సన్నమయి వచ్చె ! భుజగ
ర్వోన్నతి చరితార్ధమగు ముహూర్తము వచ్చెన్


నాటికి నేఁడా? తలపున
నాటెను సామికి వికుంఠ నగరోదితమౌ
మాటలు : దీర్ఘ విలంబము
వాటించి విభుండు నన్ను వంచించెఁగదే !

నా ప్రభువుకి నేను ఇప్పుడా గుర్తు కొచ్చాను ? నా రామచంద్రుని కనులారా ఇంతకాలాని చూసుకో గలిగే భాగ్యం కలిగింది కదా ? ఇరువది కనులున్నందుకు ఫలితం నాకీనాడు కలిగింది కదా ! నా భుజ గర్వం చరితార్ధమయ్యే రోజు ఇప్పటికి తస్థించింది కదా.


నా రాముడు నన్నెంత వంచన చేసాడయ్యా ? ఎన్ని అకృత్యాలు చేసాను ? పాతాళ రాజుని అణగద్రొక్కాను. ఇంద్రుని జయించాను. వెండి కొండని, కైలాస పర్వతాన్ని అల్లల్లాడ చేసాను. ఇంత విశ్వ క్షోభం చేసినా నా రాముడు నన్ను సంహరించడానికి రాడేమీ?

శివ ధునువు విరిచాడని వినగానే, అది నా మాధవుని పనే అని తెలుసుకున్నాను. రోజొక ఏడాదిగా ఎన్నో ఘోర కార్యాలు చేసాను.సీతాపహరణం చేసి రామునికి తీవ్రమైన ద్రోహం చేసాను.
అప్పటికీ, దండకారణ్యమంతా దేవి జానకి కోసం పిచ్చి వాడిలా తిరిగాడు. చెట్లనీ, కొండలనీ, పశుసక్ష్యాదులనీ అడిగాడు. ఊరికే విలపించాడు. ఈ ఘోర కృత్యం నేను చేసి ఉంటానని నా విభుడు నన్ను మరిచి పోయాడు కదా !

జటాయువు నోట జానకి జాడ తెలుసుకుని క్రోధంతో ఎలుగెత్తి ‘ రావణా !’ అని నా రాముడు
నన్ను సంహరిస్తానని ప్రతిన చేసినప్పుడు కదా, నాకు మనశ్శాంతి దొరికింది !

పదుగురులోన నన్ గుఱుతు పట్టునొ, లేదొ, యటంచు సర్వ భూ
విదిత పరాక్రముండనయి, వీఱిడి సేతలు పెక్కు సేసితిన్
బదుగురు ‘ వీడు రక్కసు’డనన్ వెడనిందల కగ్గమైతిఁదా
మది మదినుండి నన్ మఱచె, మాధవుడెంతటి క్రూర చిత్తుడో !

అందరిలోనూ నన్ను గుర్తు పడతాడో లేదో అని, లోకాలన్నింటికీ తెలిసిన గొప్ప పరాక్రమవంతుడనయినా, నా రాముడు గుర్తించడం కోసం ఎన్నో పిచ్చి చేష్టలు చేసాను. అందరి చేతా రాక్షసుడననిపించుకుని నిందలు మోసాను.ఐనా, నా రాముడు నన్ను ఇంత వరకూ గుర్తించనే లేదు. ఎంత క్రూరుడో కదా !

రాముడు నన్ను గుర్తు పడతాడు కదా అని ఆశతో తప్ప - మునులను హింసించడం నాకు యిష్టమా చెప్పండి ? ఆడువారిని చెఱచడానికి నేను పశువునా ? నువ్వే చెప్పు ! ఇలా తన సేవకుని బాధించడం ప్రభువికి వినోదం కావచ్చు. ఇంత చేసినా , నాకు మాట దక్క లేదు. మాధవుడు నాకు మంచిని దక్కనీయ లేదు. ఓ సాగరా ! ఏం చెప్పమంటావయ్యా ? తల్లి జానకమ్మని అపహరించక నాకు తప్ప లేదయ్యా !!


స్వామి ద్రోహము కూడ నేర్పెఁదుదకున్ , వైకుంఠుఁడౌరౌర ! తా
నేమో, నాకిడు బాస లోఁదలపఁడాయెన్ గ్రుడ్డి లోకమ్ము త
న్నే మెచ్చెన్, దొసగెల్లఁజాల్పు దలలన్ నిల్పెన్, మహాంభోనిధి
స్వామీ ! మర్త్యుల రాజనీతి నిపుణత్వంబెల్ల విన్నావుగా ?

నాకు నా స్వామి చివరకు స్వామి ద్రోహం చేయడం కూడా నేర్పించాడయ్యా. నాకానాడు ఇచ్చిన మాట తలచనే తలచడు. లోకం గుడ్డిది. అతనినే నమ్ముతుంది. నన్నేమో నిందిస్తుంది. సాగరా ! ఈ మనుషుల నైజం చూసావు కదా ?

నేనేం ఉట్టి కట్టుకుని ఉండి పోతానా ? నాకెందుకు లోక భీతి ? ఆ మంచితనమేదో అతనికే దక్కనీ ! అతడు నన్ను తెలుసుకుంటే నాకదే చాలును.

అంతా తెలిసి కూడ ఏమీ తెలియని వాని వలె ఉంటాడు హరి. తెలిసీ తెలియక నేను మాత్రం జానకీ మాతని అపహరించి మోస పోయాను.

ఇంట (వైకుంఠలో) ఉండేటప్పుడు నా హరికి ఈ మాయ వర్తనలేవీ తెలియవు. దర్శనమిచ్చి, తరింప చేసే వాడు. అదేమిటో, భూలోకానికి దిగి మాయదారి వాడయిపోయినాడు !

తన దగ్గరకి నేను చేరే దారులన్నీ మూసివేసినా, ఓర్చుకున్నాను. ఈ రావణుని పాద ధూళి ముద్రలు కానుపించని తావు లేకుండా, అంతా ఆక్రమించాను కదా, మరి నన్ను చంపడానికి రాకుండా నా ప్రభువు ఎందుకు ఆలస్యం చేసాడో కదా ?

వైర భక్తితో నా ప్రభువుని చేరుకోవాలని ఎంత చేసినా ఫలితం దక్కడం లేదు ... సరే, తన మాయలు నేను చెల్లనిస్తానా ? రావణుడంటే ఏమనుకున్నాడో ...


రావణుఁడన్న కాళ్ళబడు రాయియుఱప్పయుఁగాదు, జాలిమై
గావఁగ నాతి కోతియునుఁగాకియు గ్రద్దయుఁగాదు, లోక వి
ద్రావణుఁగ్ర వీర చరిత ప్రథితుండతి మానియౌ దశ
గ్రీవుడు పోరిలోఁబొడిచి గెల్చును, చచ్చునుఁగాక, వేడునే ? !

రఘువీరుని శౌర్య పరాక్రమాలన్నీ మారీచుడు, శూర్పణఖ, హనుమ, జానకి మున్నగు వారి వలన ముందే
విన్నానులే !

వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై
మునియాఙ్ఞ్ల దాటకఁదునుము సొగసు
జునపాలు వ్రేలు నీడున శైవ చాపమ్ము
విఱిచిన శృంగార వీ ర మహిమ
పసుపు బట్టల నిగ్గు పస భార్గవ క్రోధ
సంధ్య మాయించిన శౌర్య సార
మాలిఁబాసిన క్రొత్త యలతమై వజ్రసా
రుని వాలి నొక కోలఁదునుము సటిమ

వింటియే గాని, ఇన్నిటికంటె, రాచ
పట్టము దొరంగి, నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి : సామికే తగుననుకొంటె కాని.

అన్నీ విన్నానులే. శివ ధనువు విరవడం, పరశు రాముని నిలవరించడం, వాలిని ఒకే కోలతో వధించడం అన్నీ విన్నాను. అన్నింటికన్నా, రాచ వలువలు విడిచి నార చీరలు ధరించి వనవాసం చేసిన ఆ గుండె నిబ్బరాన్ని గురించి విన్నాక, నా స్వామికి తగిన వాడిని నేనే అనుకున్నాను.


తోయధీ ! ఎంత భాగ్యవంతులయ్యా, మీరు ! ఆ ముగ్ధ మోహనుని రూపం కనులారా చూడ గలిగేరు... నేనందుకు నోచుకో లేదు.

తోయధీ ! ధన్యుడవు నీవు, తొల్లి మత్స్య
కమఠ రూపత నీదె నీ గర్భము హరి
నేడు వెండియు తరింప నున్నాడు నిన్ను
నెల్లి నినుఁజేరి పవళించు నేమి యెఱుఁగ
నట్టులు తరంగలాలితుండగుచు శౌరి.


ఓ సముద్రుడా ! నువ్వెంత ధన్యుడవయ్యా. లోగడ హరి- మత్స్య . కూర్మ రూపాలలో నీ గర్భంలోనే అవతరించి, నిన్ను తరింప చేసాడు. ఇప్పుడు మళ్ళీ నిన్నే ధన్యుడిని చేస్తున్నాడు. ఆ పిమ్మట తిరిగి నిన్నే చేరి, అలల మీద చల్లగా ఊగుతూ ఏమీ ఎరుగనట్టుగా పాలకడలి మీద శయనిస్తాడు.

మీలాంటి వాళ్ళే చరితార్ధులయ్యా. కాదనను. కానీ, తన మోము ముద్దాడిని తండ్రి కంటె, చనుద్రావించిన తల్లికంటె, తనలో సగమయిన సీత కంటె, సేవలు చేసిన తమ్ముడు లక్ష్మణుని కంటె, ఈ లోకకంటకుడైన రావణునకే స్వామి వశుడు సుమీ, తెలుసా !

ఆలోచించి చూస్తే, ఇప్పుడనిపిస్తోంది. తల్లి జానకిని అపహరించి ఎంత మంచి పని చేసానో కదా ! ఇంత అపరాధం స్వామికి చేయక పోతే అతని దర్శనం నాకెలాగ అవుతుంది చెప్పు ?


యుద్ధాలు నా రామునికి కొత్తా ఏమిటి ? మధు కైటభులని వధించ లేదో? వరాహ నారషింహావతారాలు ఎత్తి దుష్టులను పరిమార్చ లేదో ? నేడు పురుషోత్తమునిగా అవతరించి రావణ వధకి పూనుకున్నాడు.

ఎన్నో వీర కృత్యాలు చేసాను. కాని, నా రామునితో వైరం నేడు గదా సంభవ మవుతోంది. ఇది నాకు నిజంగా పండుగే కదా !

లేదు పతంగ వాహనము, కరంబులఁబాంచజన్య కౌ
మోదకులున్, సుదర్శనము పూనడు , రావణు గెల్వ వచ్చె దా
మోదరుడెంత నేరుపరియో ! పది జంటల చేతులార ! ఆ
కైదువులాజి వేళ హరి కైకొను మాడ్కి పరాక్రమింపుడీ .


పతంగ వాహనము లేదు. పాంచజన్య కౌమోదకాదులు లేవు, సుదర్శన చక్రం ధరించ లేదు. రావణుడిని గెలవడానికి వస్తున్నాడు. నా రాముడు ఎంత వీరుడో కదా ! ఓ పది జతల చేతులారా !
హరి సమర్పితములుగా యుద్ధంలో మీరు పరాక్రమించండి.


ఒంటి విలుకాడవై నన్ను నోర్చు తెగువ
వలదురా ! రాఘవా ! రాఘవా ! దశాస్యు
నక్కటా ! క్రూర విక్రము, స్వాత్మ హనన
పాతకుని చేకుముర ! నీ పాదమాన !

రామా, నీ పాదాలు పట్టుకని వేడుకుంటానయ్యా, ఒంటరి విలుకాడివిగా నాతో యుద్ధానికి రాకయ్యా. అంత తెగువ నీకు వలదు సుమా. క్రూరుడైన ఈ రావణుని తనని తానే సంహరించుకునే పాతకునిగా చేయకయ్యా.

పొమ్ము నెచ్చెలి ! రామ మూర్తికి నెదురేగి
పుట్టు ముత్తియముల మ్రుగ్గు వెట్టి
అత్యున్నతమ్మును, నతి గభీరమ్మైన
గర్భ వీచిమ తల్లి గద్దె వెట్టి
రమ కంటె, కౌస్తుభ రత్నమ్ముకంటె , గా
రామైన మణుల దర్శన మొసంగి,
లంకకుఁబంపు , పౌలస్త్యుండు సిరి కొల్వు
చవిక యౌ వక్షమ్ము చంద్రహాస

దారిత మొనర్చి , ఆ గంటు దారి వెంట
హృదయమున్ జొచ్చి, యేకాంత మిచ్చగించి
స్వాగతముఁబల్కునని విన్నపమ్ము సల్పు
మచటనే పునర్దర్శన మగుత మనకు.


నేస్తమా ! సముద్రుడా ! వెళ్ళి రావయ్యా. రామ చంద్ర మూర్తికి ఎదురేగి, జాతి ముత్యాల ముగ్గులు పెట్టు. గంభీరమైన సాగర తరంగ వీచికల గద్దెమీద కూర్చో పెట్టు. రమ కంటె , కౌస్తుభ రత్నం కంటె కూడ విలువైన మణులను కానుకగా సమర్పించు. లంకానగరానికి సగౌరవంగా పంపించు.
ఈ రావణుడు గుండె నిండా అతని రూపమే కలిగి ఉన్నాడని చెప్పు. ఆ ప్రభువునకు స్వాగతం పలుకుతాడని విన్నవించు. తిరిగి మనం కలిసేది అక్కడేనయ్యా ....


ఇదీ కాటూరి వారి రసవత్తరమైన ఖండ కావ్యం.
ఇదొక రసఝరి. తేనె వాక. అద్భుత కళాకృతి.

ఈ ఖండ కావ్య పఠనం ఒక అపూర్వానందానుభూతిని కలిగిస్తుంది. రసమయ సాహితీ సాగరాన ఓలలాడిస్తుంది.

స్వస్తి.





2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

చక్కని విషయం చెప్పారు.చాలా చక్కగా ఉంది మీ వివరణ. మంచి విషయం చెప్పిన మీకు ధన్యవాదములు.

పద్మ చెప్పారు...

చాలా బావుందండి. రావణుడిని ఈ దృష్టికోణం నించి చూసి రాసిన రచన ఎక్కడా చదవలేదు. జయవిజయులుగా స్వామిని విడిచి ఎక్కువ కాలం ఉండలేక రాక్షసులుగా మూడు జన్మలెత్తారని చదివానే కానీ ఇలా రావణుడి రూపంలో స్వామి దర్శనం కోసం వెంపర్లాడాడని కాటురి వారి ఖండకావ్యంలోనే చదివాను. కల్పనేనేమో కానీ భగవంతుడి దర్శనం కోసం భక్తుడు పడే ఆత్రుత అంతా కాటురివారు చాలా చక్కగా తేట తెలుగులో వర్ణించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి